కిరాణా వ్యాపారి మీద ఈ బూతుపురాణం ఏంది ఎమ్మెల్యే షకీల్?

Update: 2021-03-25 06:37 GMT
మరో వివాదంలో చిక్కుకున్నారు బోధన టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్. కిరాణా వ్యాపారి మీద ఆయన విరుచుకుపడిన ఆడియో క్లిప్ బయటకు వచ్చి సంచలనంగా మారింది. రాయలేని భాషలో వ్యాపారిని దూషించిన ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగేళ్ల క్రితం రంజాన్ పండుగకు బాన్సువాడకు చెందిన కిరాణా వ్యాపారి రుద్రంగి మురళీకు ఆరువేల తోఫా ప్యాకెట్లు ఆర్డర్ ఇచ్చారు.  ఒక్కొక్కటి రూ.600 చొప్పున మొత్తం రూ.36 లక్షలు బాకీ ఉంది. అయితే.. అందులో రూ.12లక్షలు మత్రమే తనకు చెల్లించినట్లుగా వ్యాపారి వాదన.

అంతేకాదు.. 2019 ఎన్నికల ప్రచార వేళలో క్యాటరింగ్ నిమిత్తం ఇదే వ్యాపారికి మరో రూ.4లక్షలు బాకీ పడ్డారు. మొత్తంగా రూ.30లక్షలు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వటం లేదట. తనకు ఇవ్వాల్సిన డబ్బుల కోసం రెండేళ్ల నుంచి ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నా ఆయన నుంచి స్పందన లేదని వ్యాపారి వాపోతున్నారు. చివరకు తన ఫోన్ బ్లాక్ చేయటంతో ఒక సన్నిహితుడికితన ఆవేదన చెప్పుకున్నాడు.

సదరు వ్యక్తి ఎమ్మెల్యేకు సన్నిహితుడుకావటంతో.. ఆయన వద్దకు ఈ విషయం తీసుకెళ్లారు. దీంతో.. ఫోన్ లో మాట్లాడిన ఎమ్మెల్యే షకీల్.. వ్యాపారిని బండ బూతులు తిట్టేశారు. నీకు ఎక్కడి డబ్బులు ఇచ్చేదిరా.. అంటూ మొదలైన బూతుల పర్వం క్లిప్ మొత్తం సాగుతూనే ఉంది. తనకు ఇవ్వాల్సిన అప్పు తిరిగి ఇవ్వకుండా తనను తిట్టటాన్నిసదరు వ్యాపారి ప్రశ్నించారు. ఈ వ్యవహారం ఇప్పుడు వైరల్ గా మారింది. ఎమ్మెల్యే తీరును పలువురు తప్పు పడుతున్నారు.
Tags:    

Similar News