పాజిటివ్ నెగ‌టివ్ అవుతోంది కేసీఆర్ సాబ్‌

Update: 2016-10-27 12:48 GMT
ఇటీవ‌ల ఓ స్వ‌చ్ఛంద సంస్థ చేసిన స‌ర్వేలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సర్కారు ఇపుడు ఎన్నిక‌ల‌కు వెళితే 108 సీట్లు వ‌చ్చేస్తాయ‌ని తేల‌డం టీఆర్ ఎస్‌ కు పాజిటివ్ కంటే నెగ‌టివ్ గా మారుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఈ స‌ర్వే వ‌చ్చిన‌పుడే త‌ప్పుప‌ట్టిన ప్ర‌తిప‌క్షాలు తాజాగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తేల్చడానికి ఇంకా ఎంత టైం కావాలో చెప్పమంటూ సుప్రీంకోర్టు హెచ్చ‌రించ‌డంతో టీఆర్ ఎస్‌ పై మ‌రింత ఘాటుగా స్పందిస్తున్నాయి. తెలంగాణ టీడీపీ నాయ‌కుడు బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్ మీడియాతో మాట్లాడుతూ తాజాగా నిర్వ‌హించిన స‌ర్వేలో 108 సీట్ల టీఆర్ ఎస్‌ కు వచ్చేస్తాయని, మిగతా పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని సర్వేలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టడానికి తెరాస పాలకులు శాయశక్తులా తంటాలు పడ్డ ప్ర‌య‌త్నం నిజం కాద‌న్నారు. ఆ సర్వేలపైన టీఆర్ ఎస్ నేత‌ల‌కు నిజంగా నమ్మకముంటే  తక్షణమే ఎన్నికలకు వెళ్లే ధైర్యం ఉందా అని మ‌ల్ల‌య్య యాద‌వ్‌ ప్ర‌శ్నించారు.

కేసీఆర్ సర్కార్ ప్రతిపక్ష శాసనసభ్యులను కాంట్రాక్టులతో ప్రలోభాలకు గురిచేస్తూ, కోర్టుల్లో కాలయాపన చేసుకుంటూ వెళ్తున్న వైఖరికి కోర్టు తాజా ఆదేశాలు చెంప‌పెట్టు వంటివ‌ని మ‌ల్ల‌య్య యాద‌వ్ అన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తేల్చడానికి ఇంకా ఎంత టైం కావాలో చెప్పమంటూ న్యాయ‌స్థానం వేసిన మొట్టికాయలతో తెరాస సర్కారుకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతోంద‌ని పేర్కొన్నారు. గత రెండున్నరేళ్లలో ప్రలోభాలతో, బెదిరింపులతో, పార్టీ ఫిరాయింపులతో విశృంఖలంగా ప్రవర్తించిన టీఆర్ఎస్, తమ అక్రమాన్ని సమర్ధించుకోవడానికి కోర్డు ముందు వెయ్యని పిల్లిమొగ్గలేన‌ప్ప‌టికీ ఫ‌లితం ద‌క్క‌లేద‌ని అన్నారు. నవంబర్ లోపు తేల్చి చెప్పమని కోర్టు ఆదేశించడం హర్షణీయమ‌ని అన్నారు. స‌ర్వే నిజ‌మ‌ని కేసీఆర్‌ - టీఆర్ ఎస్‌ పార్టీలు ఫిరాయించిన శాసనసభ్యులచేత రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లే సాహసం మీకు ఉందా అని మ‌ల్ల‌య్య యాద‌వ్ ప్ర‌శ్నించారు. ప్రజాకోర్టులో తేల్చుకుందాం రమ్మని తెలుగుదేశం తెలంగాణ రాష్ట పార్టీ తెరాసకు సవాల్ చేస్తోందని తెలిపారు.  ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టడమే పరిపాలనగా నమ్మకున్న ఈ సర్కార్‌ కు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. బంగారు తెలంగాణను బాధితుల తెలంగాణగా తయారు చేయాలని తెరాస చేస్తున్న కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని టీడీపీ నేత స్ప‌ష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే పార్టీ ఫిరాయింపులపైన సమన్లు అందుకున్న ఘనత కేసీఆర్ స‌ర్కారుకే దక్కుతుందని. టీఆర్ఎస్ నేత‌ల‌కు నిజంగా ద‌మ్ముంటే  త‌మ స‌వాల్‌ ను స్వీకరించి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి కేసీఆర్ సర్కార్ సిద్ధపడాలని డిమాండ్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News