కేంద్రానికి షాకిచ్చిన బాంబే హైకోర్టు.. కీలక వేళలో అసలుసిసలు నిర్ణయం

Update: 2021-05-20 03:36 GMT
కీలక నిర్ణయాలు తీసుకోవటంలో ప్రభుత్వాలు చేష్టలుడిగినట్లుగా వ్యవహరిస్తున్న వేళ.. కోర్టులు క్రియాశీలకంగా వ్యవహరిస్తే ఎలా ఉంటుందనటానికి నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెప్పాలి. కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న వేళ.. దానికి చెక్ పెట్టేందుకు ఉన్న మార్గాల్లో ముఖ్యమైనది వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయటం. ప్రపంచంలో అత్యంత ఎక్కువగా కేసులు నమోదైన అమెరికాలో ఈ రోజున కేసుల నమోదు తగ్గటానికి కారణం.. భారీ ఎత్తున చేపట్టిన వ్యాక్సినేషన్ కారణమన్నది మర్చిపోకూడదు.

ఇదిలా ఉంటే.. తాజాగా దేశంలో టీకాల కొరత తీవ్రంగా వేధిస్తుండటం.. దీని కారణంగా పలు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిలిచిపోయిన దుస్థితి. ఇలాంటివేళ.. ఇంటికే పరిమితమైన పెద్ద వయస్కులకు వారింటికే వెళ్లి వ్యాక్సిన్ వేసే అంశంపై కోర్టులు ఇప్పటికే పలుమార్లు ప్రస్తావించినా.. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం రాలేదు. నిజానికి.. ప్రభుత్వం అనుకోవాలే కానీ.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయటం అసాధ్యమేమీ కాదు. కానీ.. కేంద్రంలోని మోడీ సర్కారు ఈ విషయంపై ఇప్పటివరకు విధానపరమైన నిర్ణయాన్ని తీసుకోలేదు.

ఇలాంటి వేళ.. బాంబే హైకోర్టు అనూహ్యంగా స్పందించింది. ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్ చేసేందుకు కేంద్రం ఓకే చెప్పకున్నా ఫర్లేదు.. మేం మీకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటానికి సిద్దంగా ఉన్నామంటూ బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ కు చెప్పింది. కేంద్రం ఒప్పుకోకున్నా.. ఇంటింటికి వెళ్లి పెద్ద వయస్కులకు వ్యాక్సిన్ వేయటానికి తాము అనుమతి ఇస్తామని బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా.. జస్టిస్ జీఎస్ కులకర్ణితోకూడిన డివిజన్ బెంచ్ తెలిపింది.

ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టలేని స్థితిలో ఉన్న వారు.. మంచానికే పరిమితమైన వారు.. వీల్ ఛైర్ లోనే గడిపేవారు..  వయో వృద్ధులు, దివ్యాంగుల ఇళ్ళ వద్ద తగిన వైద్యపరమైన రక్షణ చర్యలతో టీకాలు ఇవ్వడం సాధ్యమవుతుందా? లేదా? అనే విషయంపై అఫిడవిట్‌ను గురువారం దాఖలు చేయాలని బీఎంసీ కమిషనర్ ను ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి రోజు చాలా విలువైనదిగా పేర్కొన్న కోర్టు.. తదుపరి విచారణను గురువారమే జరుపుతామని పేర్కొంది. అయితే.. ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ వేయటం సాధ్యం కాదని కేంద్రం చెప్పిన మీదట బాంబే హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్య ఇప్పుడుసంచలనంగా మారింది. ఒకవేళ.. బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ కనుక ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ వేయటానికి ముందుకు వస్తే.. అనూహ్య పరిణామాలకు దారి తీస్తుందన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా.. బాంబే హైకోర్టు వ్యాఖ్య కేంద్రంలోని మోడీ సర్కారుకు ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News