బెజవాడ కనకదుర్గమ్మకు ‘‘బోనం’’

Update: 2015-07-27 05:02 GMT
సంప్రదాయాలు.. సంస్కృతులు కలబోతే నాగరికతకు మారుపేరుగా చెబుతుంటారు. రాష్ట్రం విడిపోయినా.. కొన్నేళ్లుగా సాగుతున్న సంప్రదాయాలు కొనసాగించటం తెలుగు ప్రజల మధ్య సోదరభావాన్ని మరింత పెంచే వీలుంది. రాజకీయంగా రెండు అధికారపక్షాలు కిందామీదా పడినా.. ప్రజలు మాత్రం ఆ రాజకీయాలకు ప్రభావితం కాకుండా.. సోదరభావంతో వ్యవహరించటం తప్పనిసరి.

తాజాగా అలాంటిదే బెజవాడలో చోటు చేసుకుంది. గత ఆరేళ్లుగా హైదరాబాద్ కు చెందిన జగన్మాత సమితి సభ్యులు బెజవాడ కనకదుర్గమ్మకు బోనాలు సమర్పించటం ఒక అలవాటుగా మారింది.

విభజన నేపథ్యంలో ఎవరికి వారు అన్నట్లు కాకుండా.. బెజవాడలో కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకొని బోనాల్ని సమర్పించటం పలువుర్ని ఆకర్షించింది. హైదరాబాద్ మహంకాళి జాత బోనాల ఉత్సవం ఊరేగింపు సమితి సభ్యులు ఆదివారం బెజవాడ కనకదుర్గమ్మను దర్శనం చేసుకొని బోనాలు సమర్పించారు.

ఊరేగింపుగా వచ్చిన కళాజాతల్ని.. బోనాల్ని.. దేవస్థానం ఈవో.. అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. నిజానికి ఇలాంటి సంఘటనలే.. ఇరు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజల మధ్య మరింత అనుబంధాన్ని పెంచుతాయని చెప్పొచ్చు.
Tags:    

Similar News