టీడీపీలో ఈ నేత‌ల కొంప కొల్లేరేనా...!

Update: 2022-09-13 04:27 GMT
గ‌త ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీ ఘోర ప‌రాజ‌యం చ‌విచూసింది. అయితే.. ప్ర‌జ‌ల్లో అంత వ్య‌తిరేక‌త ఉందా?  అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేసిన త‌ర్వాత‌.. ముఖ్యంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో పసుపు-కుంకుమ వంటి ప‌థ‌కాలు ఇచ్చిన త‌ర్వాత కూడా.. ఇలా ఎందుకు జ‌రిగింది? అనేది పార్టీలో ఇప్ప‌టికీ మిగిలిపోయిన స‌మాధానం లేని ప్ర‌శ్న‌. కానీ, ఒక‌టి మాత్రం నిజం అంటున్నారు సీనియ‌ర్లు. అతి విశ్వాసంతో పోగొట్టుకున్న సీట్లు చాలానే ఉన్నాయ‌ని చెబుతున్నారు. వీటిలో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం, విజ‌య‌వాడ‌కు స‌మీపంలోని పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గం వంటివి ఉన్నాయ‌ని అంటున్నారు.

ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. పార్టీకి బ‌ల‌మైన కేడ‌ర్ ఉంది. నాయ‌కులు కూడా యువ‌కులే. అయినా కూడా ఇక్కడ పార్టీ ప‌ల్టీలు కొట్టింది. దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు వారికి గెలిచే అవ‌కాశం ఉన్నా.. ఓడిపోయారు? అంటే.. అతి విశ్వాస‌మే కార‌ణమ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇన్నేళ్ల త‌ర్వాత‌.. ఈ చ‌ర్చ ఇప్పుడు ఎందుకు? అంటే.. క‌నీసం ఇప్ప‌టికైనా.. త‌మ ప‌రిస్థితిని తెలుసుకుని స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నాలుచేస్తార‌నే చెబుతున్నారు. సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో బొండా ఉమా టీడీపీ త‌ర‌పున రెండో సారి పోటీ చేసి.. కేవ‌లం 25 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఇంత త‌క్కువ మెజారిటీతో ఓడిపోవ‌డం అంటేనే ఎక్క‌డో ఏదో తేడా కొట్టింద‌ని అర్ధ‌మ‌వుతుంది. దీనికి కార‌ణం.. త‌న‌ను ప్ర‌జ‌లే గెలిపిస్తార‌నే ధీమా.. దీనికితోడు జ‌న‌సేన‌-సీపీఎం ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా నిల‌బ‌డ్డ‌.. చిగురుపాటిబాబూరావు ఓట్ల‌ను చీల్చ‌డ‌మే.

అయితే.. ఈ విష‌యంలో ఉమా.. త‌క్కువ అంచ‌నా వేసి.. బోల్తా ప‌డ్డారు. మ‌రి ఇప్పుడైనా లోటుపాట్లు స‌వ‌రించుకుంటారో లేదో చూడాలి. ఇక‌, పెన‌మ‌లూరు విష‌యానికి వ‌స్తే.. చేజేతులా.. ఇక్క‌డ బోడే ప్ర‌సాద్ గెలుపును ప‌ళ్లెంలో పెట్టి వైసీపీకి అప్ప‌గించార‌నే వాద‌న ఇప్ప‌టికీ ఉంది.

త‌న‌కు వ్య‌తిరేకంగా సొంత పార్టీలోనే కొంద‌రు చ‌క్రం తిప్పుతున్నార‌నే విష‌యం ప్ర‌సాద్‌కు తెలుసు. అయినా.. కూడా ఎక్క‌డా వారిని చ‌క్క‌దిద్ది త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు. అంతేకాదు.. అతి విశ్వాసంతో ముందుకు సాగారు.

అస‌లు కొలుసు పార్థ‌సార‌థిని (వైసీపీ అభ్య‌ర్థి) ప్ర‌జ‌లు ప‌ట్టించుకోవ‌డ‌మే లేద‌ని .. ఆయ‌న చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునే మ‌ర్మాలు తెలిసి కూడా చివ‌రి నిముషం వ‌ర‌కు తార‌ట్లాడారు. దీంతో సొంత నేత‌లే ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పి.. ఓడించారు. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికైనా ప‌రిస్థితిని ఆయ‌న స‌ర్దుబాటు చేసుకుంటారో లేదో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News