బోనీ ఫ‌స్ట్ కాల్ చేసింది ఆయ‌న‌కేనా?

Update: 2018-02-27 05:43 GMT
శ్రీ‌దేవి మ‌ర‌ణం షాకింగ్ గా మాత్ర‌మే కాదు.. ఇప్పుడు మిస్ట‌రీగా మారింది. ఆమె మ‌ర‌ణించిన రోజు అస‌లేం జ‌రిగింద‌న్న విష‌యం వివ‌రంగా బ‌య‌ట‌కు వ‌స్తే త‌ప్పించి.. అనుమానాలు తీరేలా లేవు. శ్రీ‌ను దుబాయ్ లో ఉంచి బోనీక‌పూర్ ముంబ‌యి రావ‌టం.. స‌ర్ ప్రైజ్ విజిట్ తో పాటు.. స‌ర్ ప్రైజ్ డిన్న‌ర్ కు వెళ్ల‌టానికి ముందు శ్రీ‌దేవి బాత్రూంలో మ‌ర‌ణించ‌టం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. శ్రీ మ‌ర‌ణించింద‌న్న విష‌యాన్ని బోనీక‌పూర్ మొద‌ట ఎవ‌రికి చెప్పార‌న్న విష‌యంపై ఇప్పుడు ఒక కొత్త క‌ధ‌నం బ‌య‌ట‌కు వ‌చ్చింది. బోనీక‌పూర్ కాల్ డేటాను దుబాయ్ అధికారులు ప‌రిశీలించారని.. అందులో ఎక్కువ‌సార్లు అమ‌ర్ సింగ్ నంబ‌రు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ స‌మాచారం ఆధారంగా చేసుకొని జాతీయ మీడియాకు చెందిన విలేక‌రులు అమ‌ర్ సింగ్ ను సంప్ర‌దించే ప్ర‌య‌త్నం చేశారు.

దీనికి అమ‌ర్ సింగ్ స్పందించారు. అర్థ‌రాత్రి 12.40 గంట‌ల స‌మ‌యంలో బోనీక‌పూర్ త‌న‌కు కాల్ చేశార‌ని.. సెల్ ఫోన్ సైలెంట్ మోడ్ లో ఉండ‌టంతో గుర్తించ‌లేద‌ని.. త‌ర్వాత త‌న ల్యాండ్ లైండ్ నెంబ‌రుకు ఫోన్ చేసి.. బాబీ ఇక లేర‌ని విషాద గొంతుతో చెప్పార‌న్నారు.

ఆ టైంలో మాట్లాడ‌టం బాగోద‌ని తాను ఫోన్ పెట్టేసిన‌ట్లు చెప్పారు. బ‌హుశా శ్రీ‌దేవి మ‌ర‌ణ‌వార్త‌ను బోనీక‌పూర్ త‌న‌కే మొద‌ట చెప్పి ఉంటార‌ని భావిస్తున్న‌ట్లు అమ‌ర్ సింగ్ చెప్పారు. బోనీక‌పూర్ కుటుంబంతో అమ‌ర్ సింగ్‌కు అవినాభావ సంబంధం ఉందని చెబుతారు. ఇక్క‌డో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. దుబాయ్ లో శ్రీ‌దేవిని ఉంచి.. ముంబ‌యిలోని స్నేహితుడి కుమార్తె పెళ్లికి వ‌చ్చిన బోనీక‌పూర్‌.. శుక్ర‌వారం లక్నోలో జ‌రిగిన ఇన్వెస్ట‌ర్ల స‌మ్మిట్ కు అమ‌ర్ సింగ్ తో క‌లిసి హాజ‌ర‌య్యారు.

ఆ స‌ద‌స్సులో అమ‌ర్ సింగ్‌కు అవ‌మానం జ‌ర‌గ‌టంతో ఆయ‌న కార్య‌క్ర‌మాన్ని బ‌హిష్క‌రించి వెళ్లిపోయారు. అనంత‌రం ఆయ‌న ఢిల్లీకి వెళ్లిపోగా..బోనీక‌పూర్ మాత్రం శ్రీ‌దేవి కోసం దుబాయ్ వెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు. బోనీక‌పూర్ కాల్ డేటాను మాత్ర‌మే దుబాయ్ పోలీసులు విశ్లేషించారే త‌ప్పించి.. ఆయ‌న్ను ఇంట‌రాగేట్ చేయ‌లేద‌ని.. ఎలాంటి ప్ర‌శ్న‌లు సంధించ‌లేద‌ని దుబాయ్‌కి చెందిన ఖ‌లీజ్‌ టైమ్స్ వెల్ల‌డించింది.
Tags:    

Similar News