పాక్ పనికిమాలిన పనులు..గ్రామస్థుల గోడు!

Update: 2016-11-03 05:21 GMT
ప్రశాంతత అంటే ఏమాత్రం నచ్చని దేశం అనుకోవాలే లేక, తాము మాత్రమే ప్రశాంతంగా ఉండాలని భావించే మనస్థత్వమో కానీ పాక్ తో సరిహద్దుపంచుకున్న పాపానికి జమ్మూ పరిసర ప్రాంతాల్లో ప్రజలకు దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పాక్ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడటం, మరోవైపు పాక్ అప్రకటిత సైన్యం అయిన గ్రవాదుల దాడులు మరోవైపు జరుగుతుండటంతో సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు నరకం చూస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం సుమారు 1000 గ్రామాల్లో ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు సైన్యం పంపిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో మరో 120 గ్రామల ప్రజలు తమ గృహాలను వదలి పునరావాస కేంద్రలకు వెళ్లిపోతున్నారు.

పాక్ అప్రకటిత కాల్పులకు తెగబడుతుండటంతో ఇప్పటి వరకూ 11 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జమ్ము - సాంబ - పూంఛ్‌ - రాజౌరీ జిల్లాల్లోని సుమారు 120 గ్రామాలకు చెందిన దాదాపు 25,000 మంది పౌరులు తమ గృహాలను వదిలి పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి కొన్ని ధార్మిక సంస్థలు - స్వచ్ఛంద సంస్థలు అధికారులతో పాటు వారికి సాయంగా నిలుస్తున్నాయి. ఉదయం సమయంలో తమ గృహాలను వదిలి శిబిరాలకు చేరుతున్న గ్రామస్థులు తిరిగి రాత్రికి వెళ్లిపోతున్నారట. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు 300 పాఠశాలలను - పౌరసంస్థలను మూసివేశామని అధికారులు చెబుతున్నారు.

ఈ క్రమంలో ఆ ప్రాంతాల పౌరుల పరిస్థితి అత్యంత దయణీయంగా ఉందనే చెప్పాలి. ఒకవైపు ప్రాణాలు దక్కించుకోవాలంటే శిబిరాల్లో తలదాచుకోవాలి, మరోవైపు కోత కొచ్చిన తన పైరును రక్షించుకోలేకపోతే ఏడాది కష్టం బుగ్గిపాలవుతుందని! పాక్‌ నుంచి తూటాల వర్షం కురుస్తున్న ఈ సమయంలో ఇళ్లలోనే ఉండాలనుకోవడం ఆత్మహత్యా సదృశ్యమేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పశువులు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియడం లేదని, ఈ ప్రాంతంలో తిరిగి శాంతి వెలసే వరకూ తమ జీవితాలు ఇలానే అత్యంత దయనీయంగా ఉంటాయని ఆ గ్రామస్థులు వాపోతున్నారట!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News