అమ‌రావ‌తిపై బొత్స ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

Update: 2019-06-15 11:52 GMT
ఏపీ ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌వ‌ర్లోకి వ‌చ్చిన త‌ర్వాత ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై కొత్త సందేహాలు పుట్టుకొచ్చేలా ప్ర‌చారం ఒక‌టి సాగుతోంది. నిజానికి ఈ అంశంపై అపోహ‌లు అవ‌స‌రం లేకున్నా.. జ‌గ‌న్ అమ‌రావ‌తిని రాజ‌ధానిగా కొన‌సాగిస్తారా? లేదా?.. ఇంకేదైనా నిర్ణ‌యం తీసుకుంటారా? అన్న అంశాల మీద పుకార్లు షికార్లు చేస్తున్నారు. వాస్త‌వానికి.. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై ఎన్నిక‌ల స‌మ‌యంలోనే జ‌గ‌న్ స్ప‌ష్ట‌త ఇచ్చారు.

జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే అమ‌రావ‌తి అభివృద్ది పై ప్ర‌భావం చూపుతుంద‌ని.. నిర్ల‌క్ష్యం చూపించే అవ‌కాశం ఉంద‌న్న ఆరోప‌ణ‌ల‌పై అప్ప‌ట్లో స్పందించిన జ‌గ‌న్.. అలాంటివేమీ ఉండ‌వ‌ని.. అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తాజాగా ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఇదే విష‌యాన్ని మ‌రోసారి ప్ర‌స్తావించారు. రాజ‌ధానిపై అపోహ‌లు అన‌వ‌స‌ర‌మ‌ని.. అన్ని రంగాల్లో ఏపీని అభివృద్ధి చేయ‌ట‌మే త‌మ ఎజెండాగా ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఏపీ మంత్రిగా ఈ రోజు బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఆయ‌న.. త‌న ఛాంబ‌ర్లో పూజ‌లు నిర్వ‌హించారు.ఈ రోజు బొత్స‌తో పాటు మంత్రులు మోపిదేవి వెంక‌ట‌రమ‌ణ‌.. ఇరిగేష‌న్ శాఖా మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ లు కూడా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. జ‌గ‌న్ పాల‌న‌తో.. రాష్ట్రంలోని పేద‌లు ఈ ప్ర‌భుత్వం నాది అన్న భావ‌న క‌లిగేలా పాలిస్తార‌న్నారు.

చెప్పేది మాత్ర‌మే చేస్తామ‌ని.. చేసేది మాత్ర‌మే చెబుతామ‌న్న ఆయ‌న పేద‌ల‌కు ప‌క్కా గృహ నిర్మాణాలు.. ఇళ్ల స్థ‌లాల మంజూరు చేస్తామ‌ని.. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో అనాదిగా ఉన్న స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం అందిస్తామ‌న్నారు. విమానాశ్ర‌యంలో బాబుకు త‌నిఖీలు నిర్వ‌హించ‌టం ప్ర‌తి రాష్ట్రంలో ఉండేద‌ని.. దేశంలో చంద్ర‌బాబు ఒక్క‌రే విప‌క్ష నేత కాద‌ని.. చాలామంది ఉన్నార‌న్నారు. తాము ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు భ‌ద్ర‌త కూడా తీసేశార‌ని.. అదేమంటే.. అంత భ‌ద్ర‌త అవ‌స‌రం లేద‌న్నార‌న్నారు. అమ‌రావ‌తిపై లేనిపోని అనుమానాలు వ‌చ్చేలా సాగుతున్న ప్ర‌చారానికి బొత్స త‌న మాట‌ల‌తో క్లారిటీ ఇచ్చార‌ని చెప్పాలి.
Tags:    

Similar News