బొత్స మరో సంచలనం..అమరావతి తాత్కాలిక రాజధానేనా?

Update: 2019-09-08 04:20 GMT
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిపై ఓ సారి మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ పెను కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ కలకలం సద్దుమణగకముందే... బొత్స మరోమారు రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు అమరావతిని నవ్యాంధ్ర నూతన రాజధానిగా ప్రకటించిన చంద్రబాబు సర్కారు... దానిని శాశ్వత రాజధానిగా ప్రకటించారా? లేదంటే తాత్కాలిక రాజధానిగానే పరిగణించారా? అంటూ ప్రశ్నించి మరోమారు పెను కలకలమే రేపారు. అమరావతిని శాశ్వత రాజధానిగానే గుర్తించి ఉంటే... దానికి సంబంధించిన గెజిట్ ఎక్కడ? అంటూ బొత్స చేసిన తాజా ప్రకటన ఇప్పుడు మరోమారు అగ్గి రాజేసిందనే చెప్పక తప్పదు. అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించి ఉంటే... ఆ మేరకు చంద్రబాబు సర్కారు గెజిట్ విడుదల చేసి ఉండాలి కదా అంటూ బొత్స చేసిన వ్యాఖ్యలు కాస్తంత లాజిక్ గానే అనిపిస్తున్నాయన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

మొత్తంగా రాజధాని అమరావతిపై బొత్స వరుసగా రెండు సార్లు సంచలన ప్రకటనలు చేసి కలకలం రేపారనే చెప్పాలి. జగన్ వంద రోజుల పాలన ముగిసిన నేపథ్యంలో పలువురు జగన్ పాలపపై స్పందిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ పానల సవ్యంగా లేదంటూ టీడీపీకి చెందిన చాలా మంది నేతలు వ్యాఖ్యానించారు. ఆ కామెంట్లకు కౌంటర్ ఇచ్చేందుకు మీడియా ముందుకు వచ్చిన బొత్స... టీడీపీ నేతలకు చురకలు అంటిస్తూనే... రాజధానిపై మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని ఏపీకి శాశ్వత రాజధానిగానే ప్రకటించి ఉండి ఉంటే... చంద్రబాబు సర్కారు గెజిట్ ఎందుకు విడుదల చేయలేదంటూ బొత్స కొత్త ప్రశ్నను సంధించారు. అమరావతిలో ఇప్పటిదాకా కట్టిన తాత్కాలిక భవనాల మాదిరే అమరావతిని కూడా తాత్కాలిక రాజధానిగానే పరిగణించారా? అంటూ చంద్రబాబు పాలనపై తనదైన సెటైర్లు వేశారు. తనకున్న సమాచారం మేరకు చంద్రబాబు సర్కారు రాజధానిపై గెజిట్ నోటిఫికేషనే విడుదల చేయలేదని కూడా బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ తర్వాత గతంలో తాను చేసిన ప్రకటనను మరోమారు గుర్తు చేసేలా వ్యవహరించిన బొత్స... రాజధానిపై తమ ప్రభుత్వం తప్పనిసరిగా ఓ నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని బొత్స... రాజధానిపై తాను గతంలో చేసిన ప్రకటనలపై స్పందిస్తూ జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... పవన్ ను కడిగిపారేశారు. రాజధానికి ఐదు వేల ఎకరాలు సరిపోతాయి కదా అంటూ పవన్ గతంలో వ్యాఖ్యానించలేదా? అని ప్రశ్నించిన బొత్స... రాజధాని భూములకు సంబంధించి ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిన విషయంపైనా పవన్ మాట్టాడారు కదా అని చురకలు అంటించారు. తమ ప్రభుత్వంలో మంత్రులు ఎలా ఉండాలో పవన్ చెప్పాల్సిన అవసరం లేదని కూడా బొత్స వ్యాఖ్యానించారు. ఆ తర్వాత చంద్రబాబు, లోకేశ్ లను టార్గెట్ చేసిన బొత్స... హైదరాబాద్ నుంచి రాత్రికి రాతరి మూటా ముల్లె సర్దుకుని చంద్రబాబు పారిపోయి వచ్చిన వైనాన్ని లోకేశ్ మరిచిపోయారా? అంటూ సెటైర్లు సంధించారు. మొత్తంగా అటు పవన్ తో పాటు ఇటు చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగిన బొత్స... రాజధానిపై కొత్త అనుమానాలను సృష్టించారని చెప్పక తప్పదు.

Tags:    

Similar News