ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పాలనపై వైసీపీ నేత బొత్స సత్యానారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం విశాఖపట్నంలో మాట్లాడిన బొత్స టీడీపీ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఏపీకి రైల్వే జోన్ తేలేని అసమర్ధుడు చంద్రబాబు నాయుడు అని మండిపడ్డారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఏమీ చేశారని బొత్స నిలదీశారు. పాలనను గాలికి వదిలేసి ప్రతిపక్షంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన ఆరోపణలపై నిజనిర్ధారణకు చంద్రబాబు సిద్ధమేనా.? అని సవాల్ విసిరారు.
ఎయిర్ ఏషియా కుంభకోణంలో చంద్రబాబు పేరు వచ్చిందని.. దమ్ముంటే ఏయిర్ ఏషియా కుంభకోణంపై కేంద్రాన్ని విచారణ కోరగలరా అని బొత్స సవాల్ విసిరారు. రాజధాని నిర్మాణం పేరుతో రూ. లక్షల కోట్లు దోచుకుంటున్నాడని మండిపడ్డారు. అవినీతిలో ఏపీ బీహార్ ను మించిపోయిందని బొత్స ఎద్దేవా చేశారు. ఏపీలో అవినీతి - అక్రమాలు - దోపిడీలు పెరిగిపోయాయని బొత్స ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్రంలో ఇసుక - మట్టి - మద్యం మాఫియాను పెంచి పోషిస్తున్నారని ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయకుండా రోడ్డుపై తెచ్చిన ఘనత టీడీపీదేనని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.