వెంక‌య్య అండ‌తో బాబును బుక్ చేసిన బొత్స‌

Update: 2017-05-21 07:56 GMT
ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోడీతో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ భేటీ అవ‌డం విష‌యంలో తెలుగుదేశం అత్యుత్సాహం ఆ పార్టీ మెడ‌కే చుట్టుకుంటున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇటు వైఎస్ జ‌గ‌న్‌ను, అటు బీజేపీని టీడీపీ నేత‌లు త‌ప్పుప‌డుతుండ‌టంతో..ఆ రెండు వ‌ర్గాల నుంచి కౌంట‌ర్ ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ఆఖ‌రికి టీడీపీతో అత్యంత దగ్గ‌ర‌గా ఉండే కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడు సైతం టీడీపీ తీరును త‌ప్పుప‌ట్టారు. ప్రధానితో ఎవరైనా సమావేశం కావచ్చని, ఈ విష‌యంలో కొంద‌రి అత్యుత్సాహం స‌రికాద‌ని వెంకయ్య అన్నారు. అంతేకాకుండా బీజేపీ - టీడీపీ ఇప్పుడు కలిసే ఉందని, కలిసే ఉంటామని, వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తామన్నది 2019లో తేల్చుకుంటామన్నారు. ఈ నేప‌థ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ టీడీపీ తీరుపై మండిప‌డ్డారు.

ప్ర‌ధాన‌మంత్రిని జ‌గ‌న్ కలిస్తే టీడీపీకి క‌డుపుమంట‌గా ఉంద‌ని ఎద్దేవా చేసిన బొత్స ఆ స‌మావేశంపై ఇన్నాళ్లు స్పందించిన నేత‌లు ఇప్పుడు వెంక‌య్య నాయుడు మాట‌ల‌పై ఎందుకు నోరు మెద‌ప‌డం లేద‌ని అన్నారు. వెంక‌య్య ఈ విధంగా వ్యాఖ్యానించిన విషయం టీడీపీ నేత‌ల‌కు తెలిసిన‌ప్ప‌టికీ తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోయారని వ్యాఖ్యానించారు. ప్ర‌ధానితో జ‌గ‌న్ భేటీ అవ‌డం ద్వారా త‌మ అవినీతిపై చ‌ర్య‌లు మొద‌ల‌వుతున్నాయ‌నే భ‌యంతోనే టీడీపీ నేత‌లు వ‌ణికిపోతున్నార‌ని బొత్స ఎద్దేవా చేశారు. విశాఖ కేంద్రంగా జరిగిన హవాలా కుంభకోణంలో టీడీపీ మంత్రుల పాత్ర ఉందని, త్వరలో బయటపెడతామని బొత్స సత్యనారాయణ ప్ర‌క‌టించారు.

కాగా, ప్ర‌త్యేక హోదా విష‌యంలో వైసీపీ చిత్త‌శుద్ధిని త‌ప్పుప‌ట్టే నైతిక అర్హ‌త టీడీపీకి లేద‌ని బొత్స స్ప‌ష్టం చేశారు.  ప్ర‌త్యేక హోదా ఒక ముగిసిపోయిన అధ్యాయం అని అన్న టీడీపీ నేత‌లకు ఈ రోజు హోదా అని వ్యాఖ్యానించే అర్హ‌త ఎక్క‌డిద‌న్నారు. టీడీపీ నేత‌లు హోదా వ‌ద్ద‌న్నారని, ప్యాకేజ్ చాల‌న్నారని, అయితే, ఇప్పుడు కేసుల కొట్టివేత కోసం జ‌గ‌న్‌ ప్ర‌త్యేక హోదాపై పోరాటాన్ని పట్టించుకోకుండా మోడీని క‌లిశార‌ని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని బొత్స మండిప‌డ్డారు. హోదా సాధించుకోవడానికి తాము పోరాటం చేస్తూనే ఉంటామ‌ని బొత్స చెప్పారు. తెలంగాణ ఎంపీలు కూడా ప్ర‌త్యేక హోదాకు మ‌ద్ద‌తు తెలిపితే, టీడీపీ ఎంపీలు మాత్రం ప్ర‌త్యేక హోదాపై రాజ్య‌స‌భ‌లో ఎందుకు మాట్లాడ‌లేదని ప్ర‌శ్నించారు. మ‌ళ్లీ ఈ రోజు ప్ర‌త్యేక హోదా అంటూ వ్యాఖ్య‌లు చేయ‌డానికి సిగ్గ‌నిపించ‌డం లేదా? అని ప్ర‌శ్నించారు. ప్ర‌త్యేక హోదాపై వైసీపీ రాజీప‌డ‌బోదని తేల్చిచెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News