బొత్స టార్గెట్ : చీపురుపల్లిలో టీడీపీ కొత్త వ్యూహం...?

Update: 2022-07-20 02:30 GMT
వైసీపీలో సీనియర్ మంత్రి విజయనగరం జిల్లాకు చెందిన దిగ్గజ నేత బొత్స సత్యనారాయణను ఈసారి ఎలాగైనా ఓడించాలని టీడీపీ గట్టి పట్టుదలతో ఉంది. దానికి కారణం ఒకనాడు టీడీపీకి కంచుకోటలా ఉన్న చీపురుపల్లిని బొత్స తన ఇలాకాగా చేసేసుకోవడం. ఒక విధంగా బొత్సకు చీపురుపల్లి అడ్డాగా మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన మరోమారు ఇక్కడ నుంచే పోటీకి రెడీ అవుతున్నారు.

ఇక బొత్స ఇప్పటికి మూడు సార్లు చీపురుపల్లి నుంచి గెలిచారు. 2004లో ఫస్ట్ టైమ్ గెలిచిన ఆయన వైఎస్సార్ జమానాలో కీలక మంత్రిత్వ శాఖలను చూశారు. 2009లో రెండవమారు ఇదే సీటు నుంచి గెలిచి మంత్రిగానే కాకుండా ఏకంగా పీసీసీ చీఫ్ గా కూడా పనిచేశారు. ఇక 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడినా మంచి ఓటింగ్ తే తెచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచారు. నాటి నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు.

ఈసారి కూడా బొత్స గెలిస్తే ఆయన ఫ్యామిలీకి చీపురుపల్లి దారాదత్తం ఇచ్చేసినట్లే అని టీడీపీ భావిస్తోంది. దాంతో బొత్సను ఓడించడానికి ఈసారి ఎస్సీ కార్డుని ప్రయోగించాలని చూస్తోంది. జిల్లాల విభజనలో శ్రీకాకుళం నుంచి రాజాం వచ్చి విజయనగరంలో కలసింది. దాంతో రాజాంలో కీలక నేతలుగా ఉన్న మాజీ స్పీకర్ ప్రతిభాభారతి, కోండ్రు మురళిమోహనరావు విజయనగరం జిల్లాలోకి వచ్చేశారు.

ఈ ఇద్దరూ గట్టి నేతలే. వచ్చే ఎన్నికల్లో ఈ ఇద్దరికీ టికెట్లు ఇవ్వాలి. ఇక రాజాంలో చూస్తే ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ ఉంది. ఈ మధ్యనే మహానాడుతో తొడగొట్టి మరీ ఏపీలో వైరల్ అయిన గ్రీష్మకు  లోకేష్ మద్దతు ఉంది అని చెబుతారు. ఇక కోండ్రు విషయం తీసుకుంటే ఆయనకు చంద్రబాబు మద్దతు ఇస్తున్నారు.

కాంగ్రెస్ లో ఉన్నపుడు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయిన కోండ్రు ఎస్సీలలో మంచి నేతగా పేరు తెచ్చుకున్నారు. దాంతో ఈ ఇద్దరికీ టికెట్ ఇచ్చేలాగా అది కూడా పార్టీకి ఉపయోగపడేలా టీడీపీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది అని అంటున్నారు. అదెలా అంటే బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లిలో ఈస్సీలు ఎక్కువ. బొత్స తూర్పు కాపు, బీసీ. దాంతో బీసీ కార్డుతోనే ఇన్నాళ్ళూ టీడీపీ కూడా పోటీ పడుతోంది.

ఈసారి దాన్ని మార్చి ఎస్సీలకు టికెట్ ఇవ్వడం ద్వారా బొత్సను మాజీ చేయాలని చూస్తోంది. అదే టైమ్ లో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా టీడీపీలో ఉన్న ఇద్దరు నేతలకు టికెట్లు దక్కుతాయి. ఎమ్మెల్యేలుగా వారు  అసెంబ్లీలో అడుగుపెడతారు అని ప్లాన్ వేస్తోంది. దాంతో రాజాంలో కోండ్రుకు  టికెట్ ఇస్తే చీపురుపల్లిలో ప్రతిభాభారతిని బరిలోకి దింపాలని చూస్తున్నారుట.

ఇక ప్రతిభాభారతికి చీపురుప‌ల్లికి లింక్ ఏంటి అంటే ఆమె తండ్రి మాజీ న్యాయ‌మూర్తి పున్న‌య్య 1955లో జ‌రిగిన ఎన్నికలలో   కృషికార్ పార్టీ త‌ర‌ఫున చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. ఆ విధంగా చూస్తే ప్రతిభాభారతికి చీపురుపల్లి ఒక విధంగా సొంత నియోజకవర్గం కింద లెక్క. తండ్రి పేరుతో పాటు, తన పేరుని కూడా ఉపయోగిస్తే గెలుపు బావుటా ఎగరవేయడం ఖాయమని అంటున్నారు. ఇంకో వైపు ప్రతిభాభారతి కనుక నో చెబితే కోండ్రు మురళీ మోహనరావుకు టికెట్ ఇచ్చి బొత్స మీద నిలబెట్టాలని చూస్తున్నారుట. మరి బొత్స దీనికి విరుగుడుగా ఏం ప్లాన్ వేస్తారో చూడాలి.
Tags:    

Similar News