అమెరికా విమానాశ్రయాల్లో కొత్త నిబంధన!

Update: 2016-12-23 17:30 GMT

అమెరికాలో కొన్ని నిబంధనలు ఒక్కోసారి శృతిమించుతుంటాయి. ముఖ్యంగా విమానాశ్రయాల్లో అమెరికా విమానయాన సిబ్బంది చేసే హడావిడి అంతా ఇంతాకాదు. పేరులో ఖాన్ ఉన్నా - మహ్మద్ ఉన్నా వారి టెన్షన్ మామూలుగా ఉండదు. అబ్దుల్ కలాం - షారుఖ్ ఖాన్ వంటి వారిని సైతం వదలని పరిస్థితి. దీన్ని భయం తాలుకు జాగ్రత్త అనాలో లేక అతిగా ప్రవర్తించడం అనాలో అదీగాక.. అగ్రరాజ్యం కదా విదేశీయుల విషయంలో ఎలాంటి రూల్స్ పెట్టిన భరిస్తారులే అనే నమ్మకమో కానీ తాజాగా మరో నిబంధన తీసుకొచ్చింది అమెరికా!

ఈ తాజా నిబంధన ప్రకారం అమెరికా విమానాశ్రయంలో దిగీ దిగగానే విదేశీ ప్రయాణికులంతా తమ తమ సోషల్ మీడియా వివరాలు తెలియజేయాలి. ఇలాంటి బోర్డులు గత నాలుగురోజులుగా అమెరికాలోని విమానాశ్రయాల్లో దర్శనమిస్తున్నాయి! విమానం దిగిన వెంటనే బయటకు వెళ్లే ముందు ప్రయాణికులంతా వారి వారి ఫేస్ బుక్ - ట్విట్టర్ - గూగుల్ ప్లస్ - ఇన్ స్టాగ్రాం - లింక్డిన్, యూట్యూబ్ అకౌంట్స్ ఏ యూజర్ నేం తో ఉన్నదీ చెప్పడానికన్నట్లు ఒక ఫార్మేట్ కూడా ఉంది. దాన్ని పూర్తిచేయమని విమాన సిబ్బంది ప్రయాణికులను అడుగుతున్నారు. అయితే... ఈ నిబందన ఐచ్చికమని చెబుతున్నా.. ఎందుకొచ్చిన గొడవలే అని భావించినవారంతా వారి వారి వివరాలు ఇచ్చే వెళ్తున్నారట.

అయితే అగ్రరాజ్యానికున్న ఉగ్రవాదుల ముప్పును కనిపెట్టేందుకు, ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులను నిరోధించేందుకు ఈ విధానం ప్రవేశపెట్టామని కస్టమ్స్, సరిహద్దు భ్రదతా విభాగం ప్రతినిధులు చెబుతుంటే... ఇలా అడగడం మానవ హక్కులను ఉల్లంఘించడమేనని "యాక్సెస్ నౌ" సీనియర్ లెజిస్లేటివ్ మేనేజర్ నాథన్ వైట్ అభిప్రాయపడుతున్నారు. ఈ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తారనే విషయంపై అసలు స్పష్టతే లేదని, అమెరికా భద్రత సంగతి అలా ఉంచితే ఇది సందర్శకులకు ముప్పుగా మారవచ్చని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ వాషింగ్టన్ కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News