ఉండి తమ్ముళ్లు ఉరుముతున్నారు ....బాబు ఏం చేస్తారో...?

Update: 2022-11-01 04:11 GMT
పార్టీ కోసం పనిచేసే వారిని వదులుకోను అని టీడీపీ  అధినేత చంద్రబాబు పదే పదే చెబుతూ ఉంటారు. అలాగే పార్టీ కోసం అంకితభావం చూపించిన వారిని తన మాట విన్న వారిని కూడా అసలు వదులుకునే ప్రసక్తే లేదు అంటారు. నిజానికి చంద్రబాబు మంచి నాయకులను ఎపుడూ ప్రోత్సహిస్తారు. ఆయన చలవతో చాలా మంది నాయకులు అలా టీడీపీ పాలిటిక్స్ లో లాంగ్ రన్ చేస్తున్నారు.

అయితే 2024 ఎన్నికల్లో గెలవాలన్న బాబు ఆరాటంతో పాటు చాలా నిర్ణయాలను ఈసారి  కొత్తగా తీసుకోవడం వల్ల పార్టీకి ఏ మేర లాభం జరుగుతుందో తెలియదు కానీ కీలకమైన చోట్ల కొందరు నాయకులకు ఇబ్బంది అవుతోందిట. చంద్రబాబు గతానికి భిన్నంగా ఈ మధ్య ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. తన కోసం కష్టపడుతూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ ఈసారి టికెట్లు ఖాయమని చెప్పేశారు.

అది చాలా మందికి ఉత్సాహంగా ఉన్నా 2019 నాటి రాజకీయ సమీకరణలను పరిగణనలోకి తీసుకోకుండా బాబు ఈ విధంగా సిట్టింగులకు వరం ఇచ్చేశారని, అదిపుడు చాలా చోట్ల గొప్ప చిక్కునే తెచ్చిపెట్టేలా ఉందని అంటున్నారు. అలా టీడీపీకి బలమైన జిల్లా పశ్చిమగోదావరిలోని ఉండి నియోజకవర్గంలో ఇపుడు తేడా కొట్టేసేలా ఉందిట.

నిజానికి ఉండి అన్నది టీడీపీకి కంచుకోట. టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎనిమిది ఎన్నికల్లో 2004లో ఒక్కసారి మాత్రమే ఆ పార్టీ ఓడిపోయింది. 2009, 2014లో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత కలవపూడి శివ రెండుసార్లు ఎన్నికయ్యారు. ఆయన క్యాడర్ కి బాగా అందుబాటులో ఉండే వ్యక్తి. అలాగే అధినాయకత్వం మాటను శిరసా వహించే నేత. అందుకే ఆయన  2019లో హ్యాట్రిక్ విజయానికి సన్నద్ధమవుతున్న తరుణంలో బ్రేక్ పడిపోయింది.

సరిగ్గా 2019 ఎన్నికల ముందు రఘురామ క్రిష్ణం రాజు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిపోయారు. దాంతో  టీడీపీ నుంచి సరైన అభ్యర్థి లేకపోవడంతో అప్పటికే ఉండి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కలువపూడి శివను నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని చంద్రబాబు కోరారు. అయితే శివకు అది ఇష్టం లేదు. ఉండిలో తాను హ్యాపీగా గెలిచే సీటు. దాన్ని వదిలేసి ఎంపీగా పోటీ చేయడం అంటే ఆయన నో చెప్పాలనుకున్నా బాబు గారి మాట మేరకు ఒకే అని చివరికి  పోటీకి దిగారు.

అంతే కాదు వైసీపీకి ఎంత వేవ్ ఉన్నా కూడా రఘురామకు చుక్కలు చూపించారు. కేవలం 31,909 ఓట్లు మెజారిటీతోనే వైసీపీ ఇక్కడ గెలిచింది. శివకు 4,15,685 ఓట్లు వచ్చాయి. అలా వైసీపీని గడగడలాడించి ఓడిన శివ 2024 ఎన్నికల్లో తన పాత సీటు ఉండి నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. దానికి తోడు ఉండిలో ఆయనకు బదులుగా 2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మంతెన రామరాజు కూడా క్యాడర్ కి పెద్దగా అందుబాటులో ఉండడంలేదు.

ఇక శివకు మంచి పట్టు ఉన్న సీటు అది. ఇలా అన్నీ అనుకుంటూంటే సిట్టింగులకే సీటు అని చంద్రబాబు డిక్లేర్ చేయడంతో మంతెన రామరాజు 2024 ఎన్నికల్లో పోటీకి రెడీ అయిపోతున్నారు. అది క్యాడర్ కి కూడా ఇష్టం లేదు అంటున్నారు. వారు శివకే 2024లో టికెట్ అని అనుకుంటున్నారుట. కానీ బాబు గారు మాత్రం రెండేళ్ల ముందే టికెట్లు ప్రకటించడంతో ఇపుడు కొంప మునిగింది అని అంటున్నారు.

ఈ పరిణామాల నేపధ్యంలో ఉండి టీడీపీ తమ్ముళ్ళు మాత్రం చంద్రబాబు శివకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారుట. మంచి నాయకుడు, గెలిచే నేత, క్యాడర్ కి ప్రాణం పెట్టే లీడర్ ని వదిలేస్తారా బాబుగారు ఇదేమి న్యాయమని కూడా అంటున్నరు. మరి చంద్రబాబు సిట్టింగులు అందరికీ టికెట్లు అనేశారు. ఉండి విషయంలో ఆయన డెసిషన్ మార్చుకుంటే మిగిలిన చోట్ల కూడా మార్చాల్సి ఉంటుంది.

అపుడు చాలా చోట్ల  సిటింగులు యాంటీ అవుతారు. మొత్తానికి ఉండి తమ్ముళ్ల ఆవేదన ఏదైతే ఉందో అది టీడీపీకి బిగ్ ట్రబుల్స్ ని తెచ్చిపెడుతోందా అని అంతా చర్చించుకుంటున్నారు. మరో వైపు శివ పట్ల సానుభూతి అయితే టీడీపీలో వ్యక్తం అవుతోంది మరి ఉండి వివాదానికి తెర దించేది చంద్రబాబే అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News