ఏపీలో కేసీయార్ పొలిటికల్ మసాలా అదే...?

Update: 2023-01-05 23:30 GMT
ఏపీలో బీయారెస్ ని విస్తరించాలని కేసీయార్ చూస్తున్నారు. దాని కోసం ఆయన కొందరు నాయకులను పార్టీలో చేర్చుకుని పదవులు ఇచ్చేశారు. ఇక సంక్రాంతి తరువాత ఏపీ బీయారెస్ రిలీజ్ అంటున్నారు. ఏపీలో బీయారెస్ కి స్కోప్ ఉందా. రాజకీయంగా కేసీయార్ ఏపీలో ఎలా నెట్టుకుని వస్తారు అన్న డౌట్లు అందరిలో ఉన్నాయి.

అదే సమయంలో కేసీయార్ మీద విభజనవాది అన్న ముద్ర ఉంది. ఉమ్మడి ఏపీని రెండుగా చీల్చారని, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ దుస్థితికి కేసీయార్ కారణం అన్న బలమైన అభిప్రాయం జనాలలో నిండుగా ఉంది. విభజనకు ప్రధాన  పాత్రధారి అని కాంగ్రెస్ ని ఈ రోజు దాకా ఏపీ జనాలు క్షమించలేదు. మరి అసలైన సూత్రధారి కేసీయార్ ని ఎలా మన్నిస్తారు అన్నది ప్రధానమైన ప్రశ్న.

ఏపీ ఎంతో కొంత విభజన వల్ల బాగుపడితే ఓకే. కానీ నానాటికీ తీసికట్టు అవుతోంది. అప్పుల కుప్పగా మారుతోంది. రాజధానుల రగడ అలాగే ఉంది. నిజం చెప్పాలీ ఏపీలో పార్టీలనే జనాలు పెద్దగా విశ్వసించడంలేదు. మరి బీయారెస్ ఏ విధంగా ఏపీ జనాల మనసు చూరగొంటుంది అన్నది కూడా చర్చకు వస్తోంది.

అయితే కేసీయార్ రాజకీయ చాణక్యంతో ఏపీ జనాల అటెన్షన్ ని మారుస్తారు అని అంటున్నారు. జరిగిన విభజన అంతా బీయారెస్ వల్లనే అయినా ప్రస్తుత కష్టాలకు నష్టాలకు కేంద్రంలోని బీజేపీ ప్రధాన కారణం అని కేసీయార్ తెలివిగా ఏపీ జనాల మైండ్ సెట్ ని మార్చేలా పొలిటికల్ మసాలా రెడీ చేసి ఉంచారని అంటున్నారు. ఏపీకి రాజధాని లేకపోవడానికి పొలవరం జాతీయ ప్రాజెక్ట్ అయినా పూర్తి కాకపోవడానికి ఏపీకి సరిగ్గా నిధులు కేటాయించకపోవడానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కేంద్రం కారణం అని కేసీయార్ ఎలుగెత్తి చాటబోతున్నారు.

అలాగే గట్టిగా నినదించబోతున్నారు. దానికి తోడు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం కంకణం కట్టుకోవడం మీద కేసీయార్ ఫైర్ అవుతారు అని అంటున్నారు. ఆంధ్రుల హక్కుగా 32 మంది ప్రజల త్యాగాలతో విశాఖ స్టీల్ సాధించుకున్న సంగతిని ఆయన గుర్తు చేయబోతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తెలంగాణా నుంచి కూడా త్యాగాలు చేసిన వారున్నారని చెప్పబోతున్నారు.

ఇలా గత తొమ్మిదేళ్ళుగా కేంద్రం ఏపీకి చేసిన చేస్తున్న అన్యాయాన్నే కేసీయార్ తన అజెండాగా చేసుకుని ఏపీలో ల్యాండ్ అవుతారు అని తెలుస్తోంది. ఏపీలో చూస్తే ప్రధాన పార్టీలు అన్నీ కూడా బీజేపీని పల్లెత్తు మాట అనే సీన్ లేదు. అధికార వైసీపీ అనధికార మిత్రుడిగా ఉంటోంది అన్న ప్రచారం ఉంది. తెలుగుదేశం బీజేపీతో పొత్తుల గురించి ఆలోచిస్తోంది, జనసేన అయితే బీజేపీకి అచ్చమైన నేస్తంగా అధికారికంగా ఉంది. ఏపీలో వైసీపీ మీద పెద్ద గొంతు చేసే టీడీపీ జనసేన కేంద్రం విషయం వచ్చేసరికి గమ్మున ఉండిపోతున్నాయి అన్న విమర్శలు ఉన్నాయి.

అలాగే వైసీపీ కూడా ఏపీ అప్పులపాలు కావడానికి కేంద్రంలోని బీజేపీ వివక్ష రాజకీయం కారణం అని తెలిసినా తెలుగుదేశం మీదనే విమర్శలు చేస్తూ వస్తోంది. పోలవరం పూర్తి కాకపోవడానికి బీజేపీ కారణం అని తెలిసినా చంద్రబాబునే నిందిస్తుంది. తాము గట్టిగా గత ఎన్నికల్లో  నినదించి అధికారంలోకి వచ్చేందుకు రాచబాట వేసిన ప్రత్యేక హోదాను ఇపుడు పూర్తిగా మరచిపోయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని తెగనమ్మాలని చూసినా కూడా వైసీపీ ఏమీ అనడంలేదన్న విమర్శలు విపక్షాలు చేస్తున్నాయి.

ఇలా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ బీజేపీని వదిలేస్తున్నారు. ఇపుడు కేసీయార్ ఈ జానర్ లోకే వెళ్తారని అంటున్నారు. ఏపీ జనాలకు బీజేపీ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది అని అంటున్నారు. దాంతో కేసీయార్ విభజన పాపాలకూ శాపాలకూ అసలైన ముద్దాయి బీజేపీ అని గర్జించడం ద్వారా ఏపీ జనాల మద్దతు చూరగొనేందుకు వ్యూహరచన చేస్తున్నారు అని అంటున్నారు. స్టీల్ ప్లాంట్  విషయంలో కేసీయార్ బిగ్ సౌండ్ చేస్తే కనుక ఏపీ జనాల మద్దతు కచ్చితంగా ఉంటుంది. ఆరేడు జిల్లాల మీద విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రభావం కచ్చితంగా ఉంటుంది అని అంటున్నారు.

అలాగే ప్రత్యేక హోదా విభజన హామీలు పోలవరం రాజధాని వంటి అంశాలతో నేరుగా మోడీతో కేసీయార్ ఢీ కొడితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది అని అంటున్నారు. అయితే కేసీయార్ కూడా కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పుకుంటె ఆయన పోరాటానికి చిత్తశుద్ధి ఉంటుంది అని అంటున్నారు. పోలవరానికి తెలంగాణా నుంచి అడ్డంకులు తాము సృష్టించమని స్పష్టం చేయడమే కాదు క్రిష్ణానది మీద రాయలసేమ సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరాలను తొలగించుకుంటేనే ఆయన్ని నమ్ముతారు అని అంటున్నారు. ఇక అమరావతి ఏకైక రాజధాని అని చెప్పడం ద్వారా విపక్షం అజెండాని క్యాచ్ చేసిన కేసీయార్ బీజేపీతో తనతో కలసి వచ్చే పార్టీలను చూసుకుని ఏపీలో నయా రాజకీయం చూపిస్తారు అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News