మరో 15 రోజుల్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సమయంలో జీఎస్టీ కౌన్సిల్ మరోసారి కొన్ని వస్తుసేవల విషయంలో ప్రజలకు ఉపశమనం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. కనీసం 70 వస్తుసేవలపై పన్ను శాతం తగ్గించొచ్చని భావిస్తున్నారు. అందులో 40 సేవలని తెలుస్తోంది.
ఈ ఏకరూప పన్ను వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చిన తరువాత గుర్తించిన లోపాలు - ఎదురైన సమస్యలను అధిగమించేందుకు గాను కొన్ని మార్పులు కూడా చేసే అవకాశముంది. కొందరు అధికారులతో ఏర్పాటు చేసిన ఫిట్ మెంట్ కమిటీ దీనిపై జీఎస్టీ కౌన్సిల్ కు కొన్ని సిఫారసులు చేసింది.
కాగా గురువారం భేటీ కానున్న జీఎస్టీ కౌన్సిల్ ప్రధానంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు - వ్యవసాయానికి ఊతమిచ్చేలా... శుద్ధ ఇంధనాలకు కూడా ప్రోత్సాహం అందించేలా ఆయా రంగాలకు చెందిన వస్తుసేవలపై పన్ను తగ్గిస్తారని అంచనా వేస్తున్నారు.
వచ్చే సాధారణ ఎన్నికల నేపథ్యంలో అత్యంత కీలకమైన బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టడానికి ముందు నిర్వహిస్తున్న చివరి జీఎస్టీ కౌన్సిల్ భేటీ ఇది. సో.. ఇక్కడ తీసుకునే నిర్ణయాలు.. బడ్జెట్ లో ప్రతిఫలిస్తాయి. అది ఎన్నికలపైనా ప్రభావం చూపిస్తాయి కాబట్టి ఈ సమావేశాన్ని చాలా కీలకంగా భావిస్తున్నారు.
కాగా ఇంతకుముందు గౌహతిలో జరిగిన భేటీలో జీఎస్టీ కౌన్సిల్ 200 వస్తువులపై పన్ను సవరించింది. కేవలం 50 వస్తుసేవలను మాత్రమే అత్యధిక పన్ను శ్లాబులో ఉంచి మిగతావాటిపై పన్ను తగ్గించారు. ఇప్పుడు మరిన్ని వస్తు సేవల విషయంలో మోదీ ప్రభుత్వం ఉపశమనం కల్పించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.