డీజేతో బెదిరిన దున్నపోతుతో సదర్ వేడుక ఆగమాగం

Update: 2021-11-06 04:19 GMT
పండుగ వేళ.. హైదరాబాద్ లో నిర్వహించే కొన్ని ప్రత్యేక వేడుకలు ఆకర్షణీయంగా ఉంటాయి. దసరా అనంతరం ఆలయ్ భలయ్.. దీపావళి వేళ సదర్ ఉత్సవాలు.. ఇలాంటివి హైదరాబాద్ విలక్షణతను ప్రతిబింబించేలా ఉంటాయి. యాదవ సామాజిక వర్గం అత్యంత వేడుకగా నిర్వహించే ఈ సదర్ వేడుక కోసం దేశం నలుమూలల నుంచి కోట్లాది రూపాయిలు విలువ చేసే దున్నపోతుల్ని తీసుకురావటం.. వాటిని అందంగా అలంకరించటం లాంటివి చేయటం తెలిసిందే. అనంతరం వాటి చేత రకరకాల విన్యాసాలు చేయిస్తుంటారు. చూసేందుకు రెండు కళ్లు చాలని ఈ సదర్ వేడుక హైదరాబాద్ ప్రత్యేక కల్చర్ ను చెప్పకనే చెప్పేస్తుంటుంది.

ఈ సదర్ వేడుకులకు రాజకీయ ప్రముఖులు హాజరవుతుంటారు. దీపావళి వచ్చిందంటే చాలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని సదర్ హడావుడి హైదరాబాద్ మహానగరంలో కనిపిస్తూ ఉంటుంది. ఏళ్లకు ఏళ్లుగా సాగుతున్న ఈ సంప్రదాయం.. తాజాగా అనూహ్య పరిణామాలకు కారణమైంది. ఈసారి సదర్ వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. కలకలం రేపిన ఈ ఉదంతంలో డీజే హోరుతో దున్నపోతులు బెదరటం.. దాంతో అక్కడి పరిస్థితులు ఆగమాగం కావటమే కాదు.. పలువురు గాయపడిన వైనం షాకింగ్ గా మారింది.

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఏర్పాటు చేసిన సదర్ వేడుక కోసం భారీ ఎత్తున దున్నపోతుల్ని దేశంలోని పలు ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు. వేడుక సందర్భంగా భారీ డీజేలను ఏర్పాటు చేశారు. పెద్ద స్థాయిలో మ్యూజిక్.. భారీ శబ్దాల హారన్ లకు ఒక దున్నపోతు బెదిరిపోయింది. దీంతో అక్కడున్న జనం మీదకు దూసుకెళ్లింది. దానికున్న తాడు.. ఆ ప్రదేశంలో ఉన్న ఒక స్కూటీకి చిక్కుకుపోయింది.

అయినప్పటికీ లెక్క చేయని దున్నపోతు.. దాన్ని కూడా తన వెంట లాక్కెళ్లింది. బెదిరిన దున్నపోతు కారణంగా ముగ్గురు వాహనదారులకు గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దాదాపు గంట పాటు సాగిన ఈ బీభత్సంలో తీవ్ర గాయాలు కాకుండా అక్కడకు చేరుకున్న వారు తప్పించుకోగలిగారు. చివరకు దున్నపోతును నిర్వాహకులు అతి కష్టమ్మీద పట్టుకోవటం.. దాన్ని అదుపు చేయటంలో సక్సెస్ అయ్యారు.

డీజే హోరుతో దున్నపోతు బెదిరిపోవటంతో చోటు చేసుకున్న గందరగోళం.. ఖైరతాబాద్ తో పాటు దాని చుట్టుపక్కన ఉన్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో ఇలాంటి ఉదంతం సదర్ లో చోటు చేసుకోలేదని చెబుతున్నారు. డీజేపీ శబ్దాల్ని ఒక మోస్తరుకు పరిమితం చేసి ఉంటే.. ఇలాంటివి చోటు చేసుకునే అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది.


Tags:    

Similar News