నంద్యాల ఓట‌ర్ల‌ను బాబు న‌ట్టేట ముంచేస్తారు

Update: 2017-07-21 10:08 GMT
నంద్యాల అభివృద్ధి విష‌యంలో అధికార తెలుగుదేశం పార్టీ తీరుపై పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి మండిప‌డ్డారు. టీడీపీ ప్రభుత్వానికి ఉప ఎన్నికల ముందే అభివృద్ధి పనులు చేపట్టాల‌ని గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. మూడేళ్లుగా నంద్యాలలో అభివృద్ధిని పట్టించుకోని తెలుగుదేశం ప్రభుత్వం ఉప ఎన్నిక సందర్భంగా కోట్ల రూపాయలు గుమ్మరిస్తున్నట్లు బాకాలు ఊదడం తప్ప వాస్తవాలు వేరుగా ఉన్నాయన్నారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం మీద అకస్మాత్తుగా వల్లమాలిన ప్రేమను ఒలకబోస్తున్న తెలుగుదేశం పార్టీ గతంలో పది సంవత్సరాలు - ప్రస్తుతం మూడు సంవత్సరాల పాలనలో ఎన్నడు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఉప ఎన్నికలో ఎలాగైనా తమ అభ్యర్థిని గెలిపించేందుకు మోస పూరిత వాగ్ధానాలు చేస్తూ ప్రజాధనాన్ని దోచి దాన్నే ఓట్లు కొనుగోలు చేసేందుకు అక్రమ మార్గాన్ని ఎన్నుకున్నారని ఆరోపించారు. నంద్యాల పట్టణంలోని మాజీ మంత్రి శిల్పా మోహన్‌ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్ర‌భుత్వం నంద్యాల ప్రజలకు కట్టించాలనుకున్న 13 వేల ఇళ్ళ ప్రాజెక్టుకు సుమారు రూ. 960కోట్లు ఖర్చవుతుందని, ఆ మొత్తాన్ని కేంద్ర - రాష్ట్ర ప్ర‌భుత్వాలు - బ్యాంకు రుణాల ద్వారా సమకూరుస్తామని చెబుతున్నార‌ని అయితే గృహ నిర్మాణంలో రూ. 400 కోట్లను స్వాహా చేసేందుకు ముఖ్యమంత్రితో పాటు టీడీపీ నాయకులు కుట్రపన్నుతున్నట్లు రాజేంద్ర‌నాథ్ రెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ దోపిడీ విధానాలను విరమించుకోవాలని హితవు పలికారు. తెలుగుదేశం ప్రభుత్వం నంద్యాల పట్టణంలో నిర్మించతలపెట్టిన 13వేల ఇళ్లు ఒక్కొక్కటి సెంటు స్థలం విస్తీర్ణం కూడా ఉండదన్నారు. ఎక్కడో విదేశాలలో స్థలాలు దొరకని మహానగరాలలో మాత్రమే అపార్ట్‌ మెంట్లు కట్టిస్తారని అది కూడా నంద్యాలలో చేపడుతున్న గృహ నిర్మాణం షేర్‌వాల్ టెక్నాలజీ - ప్రీ ప్రాసెస్డ్ స్లాట్స్‌తో నిర్మిస్తే ఆ ఇంట్లో ఏసీ లేనిదే ఉండలేరన్నారు. పేదవారికి కట్టించే పక్కా గృహాలు ఈవిధంగా కట్టిస్తే అవి ఎంతో కాలం నిల్వవు అన్నారు. ప్రతి లబ్ధిదారుడు 20సంవత్సరాల పాటు రుణం చెల్లించేందుకు సమయం పడుతుందని, 20సంవత్సరాల అనంతరం ఆ ఇళ్లు కూడా పదిలంగా ఉండబోదని ఇంతమాత్రం దానికి బాకాలు ఊదుతూ ప్రచారం చేస్తున్నా లబ్ధిదారులు ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు. అంటే ఇప్పుడు ఊద‌ర‌గొడుతున్న అభివృద్ధి అంతా గాలిబుడ‌గ వంటిదేన‌ని బుగ్గ‌న వివ‌రించారు.

ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మూడు సంవత్సరాలుగా అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించి అకస్మాత్తుగా ఉప ఎన్నిక ముందు రోడ్ల విస్తరణ చేపట్టారని ఆరోపించారు. రోడ్ల విస్తరణలో భవనాలు కోల్పోతున్న వారికి కనీసం నోటీసు ఇవ్వకుండా, తమ సామాన్లు బయటకు తీసుకొనే సమయాన్ని ఇవ్వకుండా కూల్చివేయడం అన్యాయమన్నారు. వైకాపా అధినేత జగన్ ప్లీనరీ సమావేశంలో తాము అధికారంలోకి వస్తే నవరత్నాల్లాంటి 9 సంక్షేమ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారని ఆ పథకాలే వైకాపా విజయానికి బాటలు వేస్తాయన్నారు. వైఎస్ జగన్ పాలన ఆయన తండ్రి రాజశేఖర్‌ రెడ్డి పాలనకంటే గొప్పగా ఉంటుందని అభివర్ణించారు. నంద్యాల వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ వైకాపాకు ఓటు వేసి పరోక్షంగా జగన్‌ను గెలిపిస్తే 2019 ఎన్నికలకు ఈ ఎన్నిక రెఫరెండంగా పనిచేస్తుందని, దీంతో 2019 ఎన్నికల్లో అధికారాన్ని వైకాపా కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. నంద్యాల ఉప ఎన్నిక పూర్తిస్థాయిలో కుట్రపూరితంగా ఉందని, అధికార దుర్వినియోగం పూర్తిస్థాయిలో జరుతోందని ఆరోపించారు.
Tags:    

Similar News