సత్య నాదెళ్ల ఐటీ ప్రస్థానంలో బాబు పాత్ర ఎంత?

Update: 2016-06-06 10:51 GMT
 రాజకీయాల్లో మాటలు కోటలు దాటితే ఎంతటివారైనా విమర్శలు ఎదుర్కోవాల్సిందే... అతిశయోక్తులు ఎక్కువైతే ఎవరితోనైనా తిట్లు తినాల్సిందే. అందుకు చోటా నేతలైనా, చంద్రబాబు నాయుడైనా మినహాయింపేమీ కాదు. తాజాగా చంద్రబాబు తాను చేసిన అతిశయోక్తి వ్యాఖ్యల కారణంగా అలాంటి విమర్శలు - ఎగతాళులు ఎదుర్కొంటుండడమే ఉదాహరణ. ఉమ్మడి ఏపీలో సాఫ్టు వేర్ ఇండస్ట్రీ జెండా పాతింది చంద్రబాబేనన్నది కాదనలేని సత్యం.

జనానికే కాదు, చంద్రబాబు వ్యతిరేకులకూ ఆ సత్యం తెలుసు. కానీ... చంద్రబాబు వ్యతిరేకులు మాత్రం ఆ మాటలను బహిరంగంగా అంగీకరించరు. దాంతో చంద్రబాబు మరింత రెచ్చిపోయి సందు దొరికినప్పుడంతా తాను ఐటీ రంగాన్ని ఎలా వెలిగించానన్నది కథలుకథలుగా గొప్పలు చెబుతుంటారు. తాజాగా ఆదివారం ఆయన మరింత గొప్పలకు పోయి సత్య నాదెళ్ల మైక్రోసాఫ్టు సీఈఓ కావడానికి కూడా తానే కారణమని చెప్పుకోవడంతో వైసీపీ నేతలు ఏకి పారేస్తున్నారు.  వైస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అయితే... చంద్రబాబు మాటలను ఖండించడానికి మైక్రోసాఫ్టు సీఈఓ సత్య నాదెళ్ల జీవిత చరిత్ర అంతా తిరగేసి ఆధారాలతో సహా మైకందుకుని చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు.  1992లోనే సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ లో జాయిన్ అయ్యారని... కానీ చంద్రబాబు ఉమ్మడి ఏపీకి 1995లో సీఎం అయ్యారని చరిత్ర తవ్వారు. తన వల్లే సత్య నాదెళ్ల ఐటీ చదివారని చంద్రబాబు చెబుతుండడం చూస్తే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి ముందే సత్యా నాదెళ్ల అమెరికాలో స్థిరపడ్డారని చెబుతున్నారు.

అంతేకాదు.. చంద్రబాబు చెప్పిన మాటలను మరోసారి గుర్తు చేస్తూ అవన్నీ అబద్ధాలేనని అంటున్నారు. సత్య నాదెళ్ల తండ్రి యుగంధర్ ఐఏఎస్ ఆఫీసర్ గా తన వద్ద పనిచేశారని... ఆ సమయంలో తాను ఐటీ గురించి ఎక్కువగా మాట్లాడడంతో ఆ ప్రభావం వారిపై పడి సత్య నాదెళ్ల ఐటీ రంగాన్ని ఎంచుకున్నాడని చంద్రబాబు చెప్పడం తెలిసిందే  ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్న సత్య నాదెళ్ల చంద్రబాబు ప్రభావంతోనే ఐటీ రంగాన్ని ఎంచుకుని మైక్రోసాఫ్టులో చేరారని యుగంధర్ తనతో చెప్పారని కూడా చంద్రబాబు చెప్పారు.

అయితే... అదంతా బూటకమంటూ బుగ్గన నిగ్గు తేల్చేందుకు సిద్ధమయ్యారు.  యుగంధర్ గారు 86 నుంచి 88 వరకు ఏపీలో పనిచేశారని..  అలాంటప్పుడు 95లో సీఎం అయిన చంద్రబాబు దగ్గర యుగంధర్ ఎప్పుడు పని చేశారో చెప్పాలని నిలదీశారు.  సత్యా నాదెళ్ల కూడా చంద్రబాబు నుంచే స్ఫూర్తి పొందానని ఎప్పుడు చెప్పలేదని... నిజంగా చంద్రబాబు అంతగా స్ఫూర్తి అందిస్తే ఆయన కుమారుడు  లోకేష్ ఎందుకు ఇన్ స్పైర్ కాలేదో చెప్పాలని ప్రశ్నించారు.  చంద్రబాబు తక్షణమే సత్యా నాదెళ్లకు క్షమాపణ చెప్పాలని కూడా బుగ్గన డిమాండ్ చేశారు. బుగ్గన మాటల్లోనూ వాస్తవాలు ఉన్నాయని ఒక వర్గం భావిస్తున్న తరుణంలో సత్య నాదెళ్ల నోరు విప్పితేనే నిజాలు తెలుస్తాయేమో? అన్నిటికీ మించి లోకేశ్ ఎందుకు ఐటీ కింగ్ కాలేదన్న బుగ్గన ప్రశ్న మాత్రం అందరిలో ఆసక్తి పెంచుతోంది.
Tags:    

Similar News