యువతి శరీరంలో బుల్లెట్... కీలక మలుపు తిరుగుతున్న కేసు !

Update: 2019-12-30 05:01 GMT
హైదరాబాద్ లో కలకలం రేపిన యువతి వెన్ను లో బుల్లెట్ కేసు కొత్త మలుపు తిరిగింది. వెన్నునొప్పి తో నిమ్స్ ఆస్పత్రి లో చేరిన ఆస్మా బేగంఅనే యువతి శరీరంలో బుల్లెట్‌ను గుర్తించిన డాక్టర్ సర్జరీ చేసి దాన్ని వెలికి తీసిన సంగతి తెలిసిందే. దీంతో ఉలిక్కిపడిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఈ ఘటనలో మరో కోణం బయటపడింది. యువతి శరీరంలో బుల్లెట్‌ గాయమే లేదని పోలీసులు, కుటుంబీకులు ముందుగా ప్రచారం చేసినప్పటికీ ఆమెకు గాయం ఉన్నట్లు ఇప్పుడు స్పష్టమైంది. అలాగే ఈ విషయం బయటకి వచ్చి వారం దాటిపోతున్నా కూడా ఇప్పటి వరకు కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచలేకపోతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో పోలీసులు నిందితున్ని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా స్థానికంగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అసలు ఆ బుల్లెట్‌ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేకుండా పోయిది. ఒక చిన్న కత్తితో పొడిచాడు అంటేనే క్షణాల వ్యవధిలో వేగం అందుకొని పట్టుకునే పోలీసులు .. శరీరంలో బుల్లెట్‌ ఘటన జరిగి ఏళ్లు గడిచాయనే అనుమానాలున్నప్పటికీ ఇంకా కాల్చిన వ్యక్తిని గుర్తించక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఫలక్‌నుమా, జహనుమా ప్రాంతానికి చెందిన యువతి అనారోగ్యం కారణంగా నిమ్స్‌ ఆస్పత్రి లో చేరిన విషయం తెలిసిందే. ఆమెకి ఎక్స్‌ రే తీయగా వెన్నుముకలో బుల్లెట్‌ ఉందని గ్రహించిన ఆస్పత్రి వైద్యులు వెంటనే పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారా లేదా అనేది పూర్తిగా తెలియడం లేదు. రక్తపు మరకల తో వచ్చిన వ్యక్తికి చికిత్స చేసే ముందే ఆస్పత్రి వర్గాలు ఎమ్‌ ఎల్‌ సీ (మెడికో లీగల్‌ కేసు) అని పోలీసులకు సమాచారం ఇస్తారు. ఇంత పెద్ద ఘటన గురించి పోలీసులకి వెంటనే సమాచారం ఇవ్వక పోవడం విశేషం. ఒకవేళ సమాచారం ఇచ్చి ఉంటే ఆ బుల్లెట్‌ ఎక్కడి నుంచి వచ్చిందనేది పోలీసులు అదేరోజు విచారణ ప్రారంభించి ఉండాలి. కానీ.. అలా జరగలేదు. ఆమెకు చికిత్స పూర్తి చేసి... డిశ్చార్జి చేసిన తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం.

యువతి శరీరం లో బుల్లెట్‌ కు సంబంధించి పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. బుల్లెట్‌ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరి తుపాకీ నుంచి వెలువడిందనే కోణాల గురించి ఎక్కడా చర్చే లేనట్లు తెలుస్తోంది. అసలు ఆ ఆయుధం లైసెన్స్‌ కలిగిందా లేక అక్రమంగా తరలించిందా అనేదీ ముఖ్య కోణం. కానీ.. ఆ దిశలో ఇప్పటికీ పోలీసుల వద్దనే స్పష్టత లేదు. తుపాకీతో పాటు బుల్లెట్‌ ఆమె శరీరంలోకి దూసుకెళ్లినప్పుడు దాన్ని వాడిన వ్యక్తి ఎవరనేదీ మరో ప్రశ్న. యువతి శరీరంలో బుల్లెట్‌ చేరి ఎంతో కాలం గడిచినప్పటికీ.. ఇప్పటి వరకు ఆ విషయం బయటకు రాకుండా ఎలా ఉంటుందనేదీ మరో ప్రశ్న. ఒకవేళ తూటా తగిలినప్పుడు అప్పట్లోనే ఆస్పత్రి లో వైద్యం చేయించి ఉంటే ఆస్పత్రి వర్గాలు ఆ సమాచారం ఎందుకు ఇవ్వలేదు. దీనికి ఇంకా ఏదైనా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనేది తెలియాలి. అయితే , మరికొందరు మాత్రం ఇప్పటికే ఆ తుపాకీ పేల్చిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారని , కానీ ,పోలీసులు అతన్ని బయటకి చూపించకుండా దాచే ప్రయత్నం చేస్తున్నారు అంటూ పోలీసులపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు ఒక స్పష్టమైన ప్రకటన చేస్తే కానీ, ఇందులో ఉండే అనుమానులు అన్ని తీరిపోవు.


Tags:    

Similar News