హిందూత్వ నేత‌ల‌కు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు.. మోడీ పాల‌న‌లో ఏదైనా సాధ్య‌మే!

Update: 2022-11-08 05:30 GMT
కేంద్రంలో న‌రేంద్ర మోడీ పాల‌న ప్రారంబించిన త‌ర్వాత‌.. దేశంలో హిందూత్వ‌కు ప్రాధాన్యం పెరిగిపోయింద‌నే చ‌ర్చ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అదేస‌మ‌యంలో మైనారిటీ వ‌ర్గాల‌పై దాడులు కూడా జ‌రుగుతున్నాయ‌నేది ఆయా వ‌ర్గాల మాట‌.

గ‌డిచిన ఎనిమిదేళ్ల మోడీ పాల‌న‌లో హిందూత్వ అజెండాను అమ‌లు చేస్తున్నార‌నేది ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న మ‌రో ప్ర‌ధాన విమ‌ర్శ కూడా. అయితే.. ఇప్పుడు వీటికి మ‌రింత బ‌లాన్ని ఇస్తున్న‌ట్టుగా.. హిందూత్వ నేత‌ల‌కు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు పంపిణీ చేయ‌డం తీవ్ర వివాదంగా మారింది.

పంజాబ్‌ పోలీసులు హిందుత్వ నాయకులకు బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు ఇవ్వ‌డంపై ప్ర‌తిప‌క్షాలు మండిప‌డుతున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన సుధీర్‌ సూరి హత్య నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌లోని లుథియానాలో పలువురు హిందుత్వ నాయకులకు పోలీసులు బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు ఇచ్చారు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. ఇటీవల శివసేన పార్టీకి చెందిన సుధీర్‌ సూరిని దుండగుడు తుపాకీతో కాల్చిచంపాడు. దీనిపై ప్రభుత్వం కల్పించే భద్రతపై విషయంలో పలు విమర్శలు వచ్చాయి. ఫలితంగా లుథియానా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

శివసేన నాయకుడు అమిత్‌ అరోరా బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ధరించి ఉన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు ఇచ్చినందుకు నాయకుల నుంచి డబ్బు వసూలు చేశారా, ఉచితంగా ఇచ్చారా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలావుంటే.. హిందూత్వ నేత‌ల‌కు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు పంపిణీ చేయ‌డంపై కాంగ్రెస్ స‌హా ఎంఐఎం వంటి పార్టీలు తీవ్ర‌స్థాయి లో విరుచుకుప‌డుతున్నాయి. కేంద్రంలోని మోడీ స‌ర్కారు హిందూత్వ అజెండాను అమ‌లు చేస్తున్న‌ద‌న‌డానికి ఇది ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ అని నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పించారు.

అంతేకాదు.. మున్ముందు.. ఈ దేశాన్ని ఇంకేం చేస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మైనారిటీల‌పై కూడా దాడులు జ‌రుగుతున్నాయ‌ని.. మ‌రి వారికి కూడా ఈ జాకెట్లు పంపిణీ చేస్తారా? అంటూ.. నిలదీస్తున్నారు. ఇదిలావుంటే.. పంజాబ్‌లో ఉన్న‌ది ఆప్ ప్ర‌భుత్వ‌మ‌ని.. త‌మ‌కు సంబంధం లేద‌ని బీజేపీ నేత‌లు ఎదురు దాడి చేస్తున్నారు. ఏదైనా ఉంటే.,. పంజాబ్ ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల‌ని అంటున్నారు. కానీ, ప్ర‌తిప‌క్షాలు మాత్రం బీజేపీ ప్ర‌మేయంతోనే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు పంపిణీ చేశార‌ని వాదిస్తున్నాయి. మ‌రి ఇది ఎటు మ‌లుపు తిరుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News