బుట్టా పార్టీ జంపింగ్ కేంద్రానికి తెలీదా?

Update: 2018-07-18 06:32 GMT
సున్నిత విష‌యాల మీద ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించాలి. ఇప్పుడున్న కాలంలో ఏ నేత ఏ పార్టీలో ఎంత‌కాలం ఉంటార‌న్న దానిపై ఒక‌ప‌ట్టాన క్లారిటీ లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఇదిలా ఉంటే.. పెద్ద ఎత్తున ర‌చ్చ‌గా మారిన టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల తీరు నేప‌థ్యంలో కేంద్రం జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

పెద్ద‌రికంతో వ్య‌వ‌హ‌రించాల్సిన కేంద్రం కాస్తా.. చిన్నపిల్లాడి మాదిరి త‌ప్పు చేయ‌టం క్ష‌మించ‌లేని విష‌యం. తాజాగా మోడీ బ్యాచ్ చేసిన ప‌ని.. ఏపీ విప‌క్ష పార్టీ మ‌న‌సును నొచ్చుకునేలా చేసింది. మోడీ బ్యాచ్ కెలుకుడును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. మ‌రీ.. ఇంత నిర్ల‌క్ష్య‌మా? అన్న ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..

క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక‌.. టీడీపీలోకి జంప్ అయిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలిచిన ఆమె.. వెంట‌నే టీడీపీలోకి జంప్ అయ్యే ప్ర‌య‌త్నం చేసి.. ఆ త‌ర్వాత ఊరుకున్నారు. మ‌ళ్లీ ఈ మ‌ధ్య‌న టీడీపీలోకి జంప్ అయ్యారు.

అనైతికంగా పార్టీ మారిన వైనంపై ఎంపీ బుట్టా రేణుక‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పీక‌ర్ కు ఫిర్యాదు చేసింది. ఆమెపై చ‌ర్య‌ల విష‌యంలో కేంద్రం ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ రోజు స్టార్ట్ కానున్న పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ అధ్య‌క్ష‌త‌న మంగ‌ళ‌వారం అఖిల‌ప‌క్ష స‌మావేశం జ‌రిగింది. దీనికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున హాజ‌రు కావాల్సిన  నేత‌ల‌కు సంబంధించి పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ నుంచి ఆహ్వానం బుట్టా రేణుక‌కు అందింది.

వాస్త‌వానికి ఈ ఆహ్వానం పార్టీ ప‌క్ష నేత‌కు కానీ ఉప నేత‌ల‌కు మాత్ర‌మే ఇస్తారు. ఏమీ కాని బుట్టా రేణుక‌కు ఆహ్వానం ఎందుకు పంపారో మోడీ బ్యాచ్ కే తెలియాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. స‌మావేశంలో బుట్టా రేణుక వైఎస్సార్ కాంగ్రెస్ అంటూ బోర్డు ఏర్పాటు చేశారు. ఇంత‌కీ ఇదంతా ఎందుకు జ‌రిగింద‌న్న‌ది చూస్తే.. లోక్ స‌భ‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఉన్న ఎంపీలు ఈ మ‌ధ్య‌న ప్ర‌త్యేక‌హోదా అంశంపై రాజీనామా చేయ‌టం తెలిసిందే.

అయితే.. ఆ పార్టీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ‌కు చెందిన ఎంపీలు ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఆహ్వానించాల్సిన నేత‌ల పేర్లు చూసిన‌ప్పుడు రికార్డుల ప్ర‌కారం ఇంకా అదే పార్టీలో ఉన్న‌ట్లుగా ఉన్న బుట్టా రేణుక‌ను  ఆహ్వానించారు. ఇదంతా సిబ్బంది త‌ప్పిద‌మే త‌ప్పించి మ‌రొక‌టి లేదంటున్నారు. అయితే.. బుట్టాపై పార్టీ ఫిర్యాదు చేసిన వెంట‌నే నిర్ణ‌యం తీసుకొని ఉంటే ఇలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డేది కాద‌ని చెబుతున్నారు. అఖిల‌ప‌క్ష స‌మావేశానికి వ‌చ్చిన ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి.. బుట్టా రేణుక నేమ్ బోర్డు చూసి.. ఆగ్ర‌హంతో అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌టంతో దాన్ని తొల‌గించారు.  ఇదంతా అనుకోని విధంగా జ‌రిగిందే త‌ప్పించి మ‌రింకేమీ కాద‌న్న మాట వినిపిస్తున్నా.. కీల‌క అంశాల విష‌యంలో క్లారిటీ లేకుండా.. స‌ద‌రు పార్టీని సంప్ర‌దిస్తే స‌రిపోతుంది. కానీ.. అలాంటిదేమీ లేకుండా చేయ‌టం ద్వారా పార్టీ వ‌ర్గాల్ని నొచ్చుకునేలా చేయ‌ట‌మే అవుతుంది. ఈ విష‌యాన్ని మోడీ ప‌రివారం ఎంత త్వ‌ర‌గా గుర్తిస్తే అంత మంచిది.


Tags:    

Similar News