బాబును ఇరిటేట్ చేసే సెటైర్‌ ఇది

Update: 2016-10-29 11:33 GMT
సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో కాంగ్రెస్ పార్టీ నామ‌మాత్ర‌పు స్థాయికి చేరిపోయిన‌ప్ప‌టికీ ఆ పార్టీ త‌ర‌ఫున గ‌ళం వినిపించే నేత‌ల్లో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత - ఏపీ శాస‌న‌మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత‌ సీ రామచంద్రయ్య ఒక‌రు. అవ‌కాశం దొరికితే చాలు బాబును ఇర‌కాటంలో ప‌డేసే రామ‌చంద్ర‌య్య..తాజాగా ఏపీ ప‌రిపాల‌న రాజ‌ధాని ప‌నుల శంఖుస్థాప‌న సంద‌ర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అభినందించడాన్ని  తీవ్రంగా తప్పుబట్టారు. ఏ అంశాల ప్ర‌తిపాదిక‌న ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని కేంద్ర మంత్రి హోదాలో వెంక‌య్య  పొగ‌డ్త‌ల్లో ముంచెత్తారో వివ‌ర‌ణ  ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

'ప్రత్యేక కార‌ణాల' వ‌ల్ల కేంద్ర మంత్రి వెంక‌య్యనాయుడుకు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడంటే ప్ర‌త్యేక అభిమానం ఉంద‌ని ఎద్దేవా చేసిన రామచంద్ర‌య్య ఈ ప్రేమను చాటుకునేందుకు స‌భా ముఖంగా ప్ర‌శంస‌లు ఇచ్చుకోవ‌డం ఏమిట‌ని వ్యాఖ్యానించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి అద్భుతంగా ప‌నిచేస్తున్నార‌ని అంటున్న వెంక‌య్య‌కు చంద్రబాబులో నచ్చిందేంటో చెప్పాల‌ని కోరారు. ఒక్క ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మం చేయ‌న‌ప్ప‌టికీ.... ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించడం, రైతులకు నష్టం చేసే విధానాలు అవలంబించడం,  ఓటుకు నోటు కేసులో దొరికిపోవడం వంటి  ప‌నులు చూసే వెంక‌య్య మెచ్చుకొని ఉంటార‌ని అన్నారు.  రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నందుకే చంద్రబాబును వెంకయ్య అభినందించాలా? అని ప్రశ్నించారు. నేను నిన్ను పొగుడుతాను..నువ్వు న‌న్ను పొగుడు అనే అంగీకారంతో రాజ‌ధాని ప‌రిపాల‌న కేంద్రం శంకుస్థాప‌న‌ స‌భ పెట్టిన‌ట్లు ఉన్నార‌ని రామ‌చంద్ర‌య్య సెటైర్ వేశారు. పైగా ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పొగ‌డ్త‌ల్లో ముంచెత్త‌డం ద్వారా కేంద్ర మంత్రి వెంక‌య్య‌ - సీఎం చంద్ర‌బాబు సాధించిందే ఏమిటో అర్థం కావ‌డం లేద‌ని రామ‌చంద్ర‌య్య అన్నారు.

చంద్ర‌బాబు ఇప్ప‌టికైనా స‌భా వేదిక‌గా పొగిడేయ‌డం - ప‌త్రిక‌ల్లో అనుకూల వార్త‌లు రాయించుకోవ‌డం-పార్టీ నేత‌ల‌కు పాఠాలు చెప్ప‌డం మానేసి ప‌రిపాల‌న‌పై దృష్టిపెడితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు మేలు చేసిన వారు అవుతార‌ని సీ రామ‌చంద్ర‌య్య ఒకింత ఘాటుగా వ్యాఖ్యానించారు. లేదంటే విభ‌జ‌న‌తో క‌కావిక‌ల‌మైన రాష్ట్రాన్ని మ‌రింత అంధ‌కారంలోకి నెట్టిన సీఎంగా చ‌రిత్ర‌లో నిలుస్తార‌ని మండిప‌డ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News