జగన్ కు జై అన్న వైఎస్ ఆజన్మ శత్రువు

Update: 2015-10-12 03:36 GMT
రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు, మిత్రత్వాలు ఉండవు అంటే ఇదే. వైఎస్ కుటుంబం అంటేనే... రాజశేఖర రెడ్డి అంటేనే కడప జిల్లాలో కూడా బద్ధ శత్రుత్వాన్ని కొనసాగించిన నిన్నటి తెలుగుదేశ నాయకుడు, నేటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్య తాజాగా జగన్ బాటకు జై కొడుతున్నారు. ప్రత్యేక హోదా కోసం ఆయన సాగిస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తున్నారు. ఒక రకంగా చూస్తే అన్ని పార్టీలు ఒక్క తాటి మీదకు వస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ నేతల్లో పరివర్తన కలుగుతోందా? అనే అనుమానం కలుగుతోంది. మొన్న ప్రస్తుతం రాజకీయ వాసన లేకుండా న్యూట్రల్ గా ఉన్న ఉండవల్లి, నిన్న సీపీం సీనియర్ నాయకుడు పి.మధు - నేడు సి. రామచంద్రయ్య ఇలా ఒక్కరొక్కరుగా వైకాపా అధినేత వైఎస్ జగన్ ప్రత్యేక హోదాపై చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించడం రాజకీయాలకు అతీతంగా ఏపీలో జరుగుతున్న మంచి పరిణామం అనే చెప్పాలి. చంద్రబాబుతో ఒంటరిపోరులో ఏకాకితనం అనుభవిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థి శిబిరం నుంచి వస్తున్న ఈ అనూహ్య మద్దతు ఆయనకు రాజకీయ ప్రయోజనం కలిగిస్తుందో లేదో కానీ ప్రత్యేక హోదాపై గంపెడాశలు పెట్టుకుని నిరాశతో ఎదురు చూస్తున్న ప్రజలను కాస్త చల్లబరుస్తుందని భావించవచ్చు.

కడప జిల్లాకే చెందిన కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య నేటివరకు జగన్‌ ను బద్ధశత్రువుగా పరిగణించేవారు. కాని ప్రత్యేక హోదా విషయంలో జగన్ నిరాహార దీక్షకు అనుకూలంగా ఆయన మాట్లాడటం భవిష్యత్తు రాజకీయ మార్పులకు నాందిగా కూడా భావించవచ్చని అంచనా.

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆమరణ దీక్ష చేపట్టడాన్ని తాను స్వాగతిస్తున్నట్టు, ఈ విషయంలో జగన్ తపనను తాను అభినందిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏపీ శాసనమండలి విపక్ష నేత సి రామచంద్రయ్య అన్నారు. జగన్ దీక్షపై ఆయన ఆదివారం స్పందిస్తూ ఏపీకి ప్రత్యేక హోదా కోసం గుంటూరులో జగన్ చేస్తున్న దీక్షను స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో ఎన్. చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. హంద్రీ-నీవా ప్రాజెక్టుకు చెందిన మోటారును పట్టిసీమకు తరలించి ప్రభుత్వం రాయలసీమకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. కేవలం ఒక్క శాతం ఓట్ల తేడాతో గద్దెనెక్కిన చంద్రబాబు అధికార దర్పంతో విర్రవీగుతున్నారని కూడా రామచంద్రయ్య మండిపడ్డారు.

అయిదు రోజులుగా సడలని తలంపుతో దీక్ష కొనసాగిస్తున్న వైఎస్ జగన్‌ కు రాజకీయ ప్రత్యర్థులనుంచి వస్తున్న ఈ మద్దతు ప్రత్యేక హోదా డిమాండ్‌ కు కాస్త ఊపిరి పోస్తున్నట్లే లెక్క. ఆంధ్ర రాజకీయాలను పట్టికుదుపుతున్న ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ పరమ నిర్లక్ష్యాన్ని, చంద్రబాబు విద్రోహాన్ని ఎండగట్టే శక్తుల మధ్య ఇలాంటి భావైక్యత ఉమ్మడి ప్రయోజనాల రీత్యా ఏర్పడవలసిన అవసరం ఎంతైనా ఉంది.
Tags:    

Similar News