ఖుషీ సీన్ హైదరాబాద్ రోడ్డు మీద

Update: 2020-01-17 05:34 GMT
కొన్నేళ్ల క్రితం వచ్చిన ఖుషీ సినిమాలో ఒక సీన్ అప్పట్లో చాలా పాపులర్. హీరోయిన భూమికను కొంతమంది కుర్రాళ్లు ఏడిపించే ప్రయత్నాన్ని హీరో పవన్ కల్యాణ్ అడ్డుకునే ప్రయత్నం చేయటం.. ఆ సందర్బంగా ఒకడు.. నేనెవరో తెలుసా? జయ మేడం తెలుసా? లాలూ తెలుసా? అంటూ ఫైర్ కావటం.. దాన్ని పవన్ తనదైన శైలిలో డీల్ చేయటం అప్పట్లో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. తాజాగా ఇంచుమించు అలాంటి సీనే హైదరాబాద్ రోడ్డు మీద కనిపించింది.

కాకుంటే ఇక్కడ పాత్రలు కాస్త మారాయంతే. క్యాబ్ డ్రైవర్ ఒకరు తాను సీఎం సతీమణి శోభ చుట్టానని.. తననేం చేయలేరంటూ దబాయిస్తే.. దానికి నేరెడ్ మెట్ పోలీసులు కిందామీదా పడుతూ.. సర్ది చెప్పిన వైనానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. అసలేం జరిగిందన్నది చూస్తే...

మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నెరేడ్ మెట్ క్రాస్ రోడ్డు వద్ద జాకబ్ రిక్కా అనే యువకుడు తన క్యాబ్ ను నిలిపాడు.అయితే.. ఆ కారుకు ఉండాల్సిన స్టిక్కర్ (పోలీసులు జారీ చేసేది) లేకపోవటం.. భద్రతాపరంగా పోలీసులు జారీ చేసే నెంబరు లేకపోవటాన్ని ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన జాకబ్ చెలరేగిపోతూ.. తానెవరో తెలుసా? అంటూ పెద్దగా అరవటం షురూ చేశాడు. తాను సీఎం బంధువని.. తనను ఎవరూ ఏమీ చేయలేరని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.

అతగాడి ఆగ్రహం చూసినోళ్లంతా నిజంగానే సీఎం బంధువా? అన్నంత బిల్డప్ ఇచ్చాడు. నిజంగానే సీఎంకు అంత దగ్గర బంధువైతే క్యాబ్ డ్రైవర్ గా ఎందుకు ఉంటాడు? అన్న లాజిక్ ప్రశ్న అక్కడున్న వారికే కాదు.. పోలీసులకు కూడా రాకపోవటం గమనార్హం. సీఎం బంధువైన తనకు పోలీసులు జారీ చేసే స్టిక్కర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని.. తన కేసు కోర్టులో కూడా నిలవదని తేల్చేశాడు.

అతగాడి హడావుడి చూసిన తర్వాత.. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో అన్న చందంగా.. ఎందుకొచ్చిన గొడవరా బాబు అంటూ.. చెలరేగిపోతున్న సదరు క్యాబ్ డ్రైవర్ ను బుజ్జగిస్తూ.. అతడు చేసిన తప్పును వివరిస్తూ.. ఫైన్ వేశారు పోలీసులు. అయితే.. సదరు క్యాబ్ డ్రైవర్ కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని.. అప్పుడప్పుడు అలా ఆగ్రహం వ్యక్తం చేస్తుంటాడని గుర్తించారు. సదరు క్యాబ్ డ్రైవర్ తండ్రి నిజామాబాద్ భీమ్ గల్ కు చెందిన వ్యక్తి అని.. తన కొడుకు చేసిన పనికి పోలీసులకు క్షమించాలని కోరినట్లుగా తెలుస్తోంది. సీఎం బంధువునంటూ హల్ చల్ చేసిన క్యాబ్ డ్రైవర్ వీడియో ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. 
Tags:    

Similar News