తాడిపత్రిలో మొదలైన క్యాంపు రాజకీయాలు

Update: 2021-03-15 04:30 GMT
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటిలో తెలుగుదేశంపార్టీ క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టేసింది. హోరాహోరీగా పోటీ జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రి కూడా ఒకటి. ఇక్కడ ఉన్న 36 వార్డుల్లో టీడీపీ 18 వార్డుల్లో గెలిచింది. వైసీపీ 14 వార్డుల్లో గెలవగా మిగిలిన రెండు వార్డుల్లో సీపీఐ ఇండిపెండెంట్లు గెలిచారు. వార్డుల లెక్క ప్రకారం టీడీపీనే ఎక్కువ స్ధానిల్లో గెలిచింది కాబట్టి ఛైర్మన్ కూడా టీడీపీ నేతే కావాలి.

కానీ సాంకేతిక కారణాలతో తాడిపత్రి మున్సిపాలిటిని వైసీపీనే గెలుచుకోబోతోంది. ఎలాగంటే ఎక్స్ అఫీషియో ఓట్ల రూపంలో వైసీపీకి కొన్ని అదనపు ఓట్లున్నాయి. ఎక్స్ అపీషియో ఓట్లంటే ఎంపి, ఎంఎల్ఏ, ఎంఎల్సీ ఓట్లన్నమాట. అనంతపురం ఎంపి, తాడిపత్రి ఎంఎల్ఏ, ఓట్లు వైసీపీకే ఉన్నాయి. దీంతో పాటు ఒక ఇండిపెండెంటు కౌన్సిలర్  చివరకు వైసీపీ చెంతకే చేరుతారని అనుకుంటున్నారు. తాజా లెక్కల ప్రకారం 18 మంది కౌన్సిలర్లు+ఒక ఎంఎల్సీ ఎక్స్ అఫీషియో ఓటుతో కలిసి టీడీపీకి 19 ఓట్లున్నాయి.

 ఇదే సమయంలో వైసీపీ 14 కౌన్సిలర్లు+రెండు ఎక్స్ అఫీషియో ఓట్లను చూస్తే 16 అవుతుంది. అయితే ఎంఎల్సీ దీపక్ రెడ్డి ఓటుపై వివాదం జరుగుతోంది. దీపక్ తన ఓటును రాయదుర్గం మున్సిపాలిటిలో నమోదు చేసుకున్నారు కాబట్టి తాడిపత్రిలో చెల్లదని వైసీపీ అంటోంది. ఛైర్మన్ సీటును అందుకునేందుకు వైసీపీ ఎక్కడ తమ కౌన్సిలర్లను, ఇండిపెండెంట్ ను లాగేసుకుంటుందో అన్న ఆందోళనతో టీడీపీ క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టేసింది. మొత్తంమీద సంఖ్యాపరంగా చూస్తే మున్సిపాలిటి టీడీపీకే దక్కాలి. కానీ క్షేత్రస్ధాయిలో జరిగే పరిణామాలు ఎలాగుంటుందో చూడాలి.

ఇదే పద్దతి మైదుకూరు మున్సిపాలిటీలో కూడా జరిగింది. ఇక్కడ 24 వార్డుల్లో టీడీపీ 12 చోట్ల గెలవగా వైసీపీ 11 వార్డుల్లో గెలిచింది. ఒక్కదానిలో స్వతంత్ర అభ్యర్ధి గెలిచాడు. అయితే ఇక్కడ కూడా ఎక్స్ అఫీషియో ఓట్లతో ఛైర్మన్ సీటును వైసీపీనే ఎగరేసుకుపోతోంది. ఇందుకే ఎన్నికల్లో టీడీపీ గెలిచినా ఓడినట్లే అని అనుకుంటున్నారు. 
Tags:    

Similar News