పోల‌వ‌రం ప్రాజెక్టు సాధ్య‌మేనా అంటున్నారు

Update: 2017-12-30 07:11 GMT
పోలవరం ప్రాజెక్టుపై క‌మ్ముకున్న నీలినీడ‌లు మ‌రింత పెరుగుతున్నాయి. ఒక దానివెంట ఒక‌టి షాకులు అన్న‌ట్లుగా సాగుతున్న‌ ప‌రంప‌ర‌లో తాజాగా  పనులు నిర్వహిస్తున్న ట్రాన్స్‌ ట్రాయ్‌ కంపెనీకి వ్యతిరేకంగా కెనరా బ్యాంక్‌ హైదరాబాద్‌ లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ లో పిటీషన్‌ దాఖలు అయింది. ఈ ప‌రిణామం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ట్రాన్స్‌ ట్రాయ్‌ సంస్ధను దివాలా తీసినట్లుగా ప్రకటించి - సత్వరమే దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కెనరాబ్యాంక్‌ ట్రిబ్యునల్‌ ను కోరడం గమనార్హం.

ప్రస్తుతం ట్రాన్స్‌ ట్రాయ్‌ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌ జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్టర్‌ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కంపెనీ పోలవరం ప్రాజెక్టు పనులను సక్రమంగా నిర్వహించలేకపోతోందనే కారణంతో ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనుల నుంచి ట్రాన్స్‌ ట్రాయ్‌ ప్రధాన కాంట్రాక్టర్‌ ను తప్పించాలని నిర్ణయించి - కేంద్రానికి నివేదించిన సంగతి తెలిసిందే. ట్రాన్స్‌ ట్రాయ్‌ నిర్మాణ కంపెనీకి వ్యతిరేకంగా కార్పొరేట్‌ దివాలా ప్రకియను సత్వరమే ప్రారంభించాలని కెనరాబ్యాంక్‌ ట్రిబ్యునల్‌ ను కోరడం చర్చనీయాంశమైంది. ఏపీలో అధికారప‌క్ష‌మైన‌ టీడీపీకి చెందిన ఓ సీనియ‌ర్ ఎంపీకి ప్ర‌ధాన వాటాలున్న ఈ కంపెనీ గతం లో కెనరా బ్యాంక్‌ నుంచి పెద్ద ఎత్తున రుణం తీసుకుని - చెల్లించలేదని - పలుమార్లు అడిగినా రుణం చెల్లించడంలో ట్రాన్స్‌ట్రాయ్‌ విఫలం కావడంతో కెనరా బ్యాంక్‌ గత్యంతరంలేని పరిస్దితుల్లో ట్రిబ్యునల్‌ ను ఆశ్రయించిందంటున్నారు.ఈ విషయాన్ని బ్యాంక్‌ అధికారులు కూడా ధృవీకరించడం గ‌మ‌నార్హం. ట్రాన్స్‌ ట్రాయ్‌ కంపెనీ కెనరా బ్యాంక్‌ కు రూ. 725 కోట్ల మేర అప్పుప‌డిందని స‌మాచారం. ఆ అప్పును రికవరీ చేసుకునేందుకు ట్రాన్స్‌ ట్రాయ్‌ పై ఎన్ని విధాలుగా ఒత్తిడి తీసుకొచ్చినా సంస్ధ డిపాల్టర్‌ గా మారడంతో కెనరాబ్యాంక్‌ ట్రిబ్యునల్‌ ను ఆశ్రయించిందని స‌మాచారం.

పోలవరం పనుల నుంచి ట్రాన్స్‌ ట్రాయ్ సంస్థ‌ను తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా యత్నిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి మోడీని - కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కూడా కలసి, ట్రాన్స్‌ ట్రాయ్‌ పరిస్ధితిని వివరించారు. పనులు నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతోందని, దీంతో పనులు ఇలాగే నత్తనడకన సాగితే నిర్దేశిత గడువులోపు ప్రాజెక్టును పూర్తి చేయడం కష్టమవుతుందని పేర్కొంటూ యుద్ద ప్రాతిపదికన ట్రాన్స్‌ ట్రాయ్‌ ను తప్పించి - దాని స్ధానంలో వేరే ఏజెన్సీలకు మిగతా పనులను అప్పగించేందుకు టెండర్లు కూడా పిలిచిన సంగతి తెలిసిందే.అయితే కేంద్రం నుంచి ఆదేశాల మేరకు టెండర్లను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. పనుల్లో పురోగతి కనిపించేందుకు ట్రాన్స్‌ ట్రాయ్‌ కు నెల రోజులు గడువు ఇచ్చారు. ఈ నెల రోజుల వ్యవధిలో పనుల్లో పురోగతి లేకుండా ఉంటే ట్రాన్స్‌ ట్రాయ్‌ ను తప్పించి - స్పిల్‌ వే - స్పిల్‌ చానల్‌ - రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ పనులను వేరే ఏజెన్సీలకు అప్పగించేందుకు తదుపరి చర్యలు తీసుకోవచ్చని కేంద్రం తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ మేరకు ట్రాన్స్‌ ట్రాయ్‌ పనులు చేసుకుంటూ పోతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌ ట్రాయ్‌ సంస్దను నేరుగా తొలగించకుండా సెక్షన్‌ 60 సీ నిబంధన కింద పనులను సబ్‌ కాంట్రాక్టుకు ఇచ్చేందుకు సన్నద్ధమైన సంగతి తెలిసిందే.

ఈ అంశంపై ఇప్పటికే తీవ్ర అయోమయంలో ఉన్న ఈ నేపథ్యంలోనే ట్రాన్స్‌ ట్రాయ్‌ వ్యవహార శైలిపై అప్పు ఇచ్చిన కెనరాబ్యాంక్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పు రాబట్టుకునేందుకు ఎన్నివిధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో గత్యంతరం లేక తాజాగా హైదరాబాద్‌ లోని కంపెనీ లా ట్రిబ్యునల్‌ ను ఆశ్రయించిందని స‌మాచారం. తొలుత రష్యా కంపెనీతో కలిసి - పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ పొందిన ట్రాన్స్‌ ట్రాయ్‌ 2013 జూన్‌ లో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే మధ్యలోనే రష్యా కంపెనీ పలాయనం చిత్తగించడంతో ట్రాన్స్‌ ట్రాయ్‌ లీడ్‌ పార్టనర్‌ గా ఉంటూ పనులు నిర్వహిస్తోంది. భూమి అప్పగింతలో తీవ్ర జాప్యం జరిగిందని - అందువల్లే పనుల్లో జాప్యం జరిగిందని ఆ కంపెనీకి చెందిన ఎంపీ ఇటీవల అనడం గమనార్హం. అయితే ముఖ్యమంత్రి కొన్ని పనులను వేరే ఏజెన్సీలకు అప్పగిస్తే మాత్రం తమకు ఎటువంటి అభ్యంతరం లేదని కూడా ఆ ఎంపీ ప్రకటించిన సంగతి విదితమే. స్థూలంగా పోల‌వ‌రంపై క‌మ్ముకుంటున్న నీలినీడ‌ల ప‌ర్వంలో మ‌రో ప‌రిణామాం చోటుచేసుకుంద‌ని అంటున్నారు.
Tags:    

Similar News