క్యాన్సర్ అడ్రస్; మెక్ డోనాల్డ్స్.. కేఎఫ్ సీ అండ్ కో

Update: 2016-05-24 07:46 GMT
సరదాగా తినాలనుకుంటే నగరజీవులకు వెనువెంటనే గుర్తుకు వచ్చే అడ్రస్ లుగా మెక్ డోనాల్డ్స్.. కేఎఫ్ సీ.. సబ్ వే.. పిజ్జా హట్.. డోమినోస్.. స్లైస్ ఆఫ్ ఇటలీ లాంటివి గుర్తుకు వస్తాయి. నిత్యం లక్షలాది మంది తినే ఇక్కడి తిండికి సంబంధించి షాకింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ షాపుల్లో అమ్మే బ్రెడ్లలో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లుగా గుర్తించారు. నిషేధిత రసాయనాల్ని తమ ఉత్పత్తుల్లో వినియోగిస్తున్నట్లగా తేలటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఇవే కాదు.. బ్రిటానియా.. హార్వెస్ట్ గోల్డ్ లాంటి బ్రాండ్లలో వినియోగించే బ్రెడ్లలోనూ ఈ నిషేధిత రసాయనాలు వాడుతున్నారని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ తేల్చింది.

తాజాగా ఈ సంస్థ విడుదల చేసిన నివేదికతో ఒక్కసారి ఉలిక్కిపడే పరిస్థితి. అయితే.. ఈ శాంపిల్స్ మొత్తం దేశ రాజధాని ఢిల్లీలోని పలు దుకాణాల నుంచి సేకరించే బ్రెడ్లను పరీక్షించగా తాజా విషయం బయటకు వచ్చింది. ప్రముఖ బ్రాండ్లలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. మిగిలిన వాటి పరిస్థితి ఏమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 38 బ్రాండ్లకు సంబంధించి ప్రీ ప్యాకేజ్డ్ బ్రెడ్లు.. పావ్.. బన్ లలో హానికారిక రసాయనాలు వినియోగిస్తున్నట్లుగా తేలింది.

ఢిల్లీలో లభించిన బ్రెడ్లలో నిషేధిత పోటాషియం బ్రోమేట్.. పొటాసియం అయోడేట్ లు ఉన్నట్లు తేలినట్లుగా వెల్లడించారు. ఇవన్నీ ఆరోగ్యానికి హానికరంగా పలువురు నిపుణులు చెప్పటం గమనార్హం. ఈ రసాయనాల్ని పలు దేశాల్లో బ్యాన్ చేశారని.. మనుషుల్లో క్యాన్సర్ కారకంగా కావొచ్చని సీఎస్ ఈ చెబుతోంది. అయితే.. ఈ వాదనను ఆరోపణలు వచ్చిన ప్రముఖ కంపెనీల్లో చాలావరకూ ఖండించాయి. తాము వినియోగదారుల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని.. తమ మీద వచ్చిన ఆరోపణలు నిజం కావని వెల్లడించాయి. ఈ అంశంపై కేంద్ర మంత్రి స్పందించి.. బ్రెడ్ల మీద వచ్చిన ఆరోపణల్ని పరిశీలిస్తామని.. సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని వెల్లడించారు. ఆ మధ్య వరకూ శీతల పానీయాల్లో రసాయనాలు ఉన్నట్లు తేలి సంచలనంగా మారితే.. ఈ మధ్యన పండ్లను ప్రమాదకరమైన రసాయాల మధ్య కృత్రిమ పద్ధతిలో మగ్గబెడుతున్న విషయం ఆందోళనకరంగా మారింది. తాజాగా.. రోజువారీగా కోట్లాది మంది తినే బ్రెడ్లలోనూ ప్రమాదకరమైన రసాయనాలు వినియోగిస్తున్నట్లు తేలటం భయాందోళనలకు గురి చేసే అంశంగా చెప్పాలి. ప్రభుత్వం.. అధికారులు మొద్దునిద్రను వదిలి.. ఇలాంటి అంశాల మీద వెనువెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది.
Tags:    

Similar News