కోవాగ్జిన్ వేయించుకున్నా విదేశాల‌కు వెళ్ల‌లేం... రీజ‌నేంటి?

Update: 2021-05-22 10:30 GMT
ఇప్పుడు ఎక్క‌డ చూసినా క‌రోనా వైర‌స్‌, దాని విల‌యం, ఆ విల‌యం నుంచి త‌ప్పించుకునేందుకు అనుస‌రించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, అస‌లు ఆ వైర‌స్ మ‌న ద‌రి చేర‌కుండా తీసుకోవాల్సిన వ్యాక్సిన్ త‌దిత‌రాల‌పైనే చ‌ర్చ జ‌రుగుతున్న ప‌రిస్థితి. క‌రోనాను ఎదుర్కొనేందుకు ఇప్ప‌టికే చాలా ఔష‌ధ త‌యారీ సంస్థ‌లు వ్యాక్సిన్ల‌ను ఉత్ప‌త్తి చేశాయి. వ్యాక్సిన్లు అందుబాటులోకి వ‌చ్చిన నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే అంత‌ర్జాతీయ ప్ర‌యాణాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించే అవ‌క‌శాలున్నాయి. అయితే మ‌న దేశంలో అందుబాటులో ఉన్న‌... మ‌న తెలుగు నేల‌కు చెందిన సంస్థ భార‌త్ బ‌యోటెక్ ఉత్ప‌త్తి చేస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేసుకున్న ప్ర‌యాణికుల‌కు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫ్లైట్స్ లోకి అనుమ‌తి ల‌భించేలా లేద‌న్న వార్త‌లు ఆస‌క్తి రేపుతున్నాయి. వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా ఈ త‌ర‌హా ప‌రిస్థితి ఎందుకంటే... దీని వెనుక ఓ పెద్ద క‌థ ఉంది. అదేంటో తెలుసుకుందాం పదండి.

క‌రోనా నుంచి ర‌క్ష‌ణ కోసం ప్ర‌పంచ దేశాల‌న్నీ ఇప్పుడు వ్యాక్సిన్ల ఉత్ప‌త్తి మీదే దృష్టి సారించాయి. కొన్ని దేశాలు ఇప్ప‌టికే కొన్ని వ్యాక్సిన్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి కూడా. ఇత‌ర దేశాల ప‌రిస్థితి ఎలాగున్నా... మ‌న దేశంలో ప్ర‌ధానంగా సీర‌మ్ సంస్థ‌కు చెందిన కోవిషీల్డ్‌, భార‌త్ బ‌యోటెక్ కు చెందిన కోవాగ్జిన్ లు వాడుతున్నాం. వీటిలో ఏది అందుబాటులో ఉంటే దానిని వేసుకోవ‌చ్చ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. రెంటికీ పెద్ద తేడా ఏమీ లేద‌ని కూడా తెలిపింది. అయితే మ‌రి కోవిషీల్డ్ వేసుకునే వారిని వ‌దిలేసి కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేయించుకున్న వారిని అంత‌ర్జాతీయ ప్ర‌యాణాల‌కు ఎందుకు అనుమ‌తించ‌రు?  వ్యాక్సిన్ల వాడ‌కానికి సంబంధించి ఆయా దేశాల రెగ్యులేట‌రీ సంస్థ‌లు అనుమ‌తులు మంజూరు చేస్తాయి. అదే స‌మ‌యంలో అన్ని వ్యాక్సిన్ల‌కు ఐక్య‌రాజ్య‌స‌మితి ఆధ్వ‌ర్యంలోని ఆరోగ్య విభాగం ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు చెందిన ఎమ‌ర్జెన్సీ యూజ్ లిస్టింగ్(ఈయూఎల్‌) గుర్తింపు ఉండ‌టాన్ని అన్ని దేశాలు ఆయా వ్యాక్సిన్ల‌ను గుర్తిస్తాయి.

అయితే కోవిషీల్డ్ తో పాటు ఇప్ప‌టిదాకా అందుబాటులో ఉన్న మోడెర్నా, ఫైజ‌ర్‌, ఆస్ట్రాజెనెకా, జ‌న్‌సెన్ త‌దిత‌ర సంస్థ‌ల వ్యాక్సిన్ల‌కు ఈయూఎల్ గుర్తింపు ఉంది. భార‌త్ బ‌యోటెక్ ఉత్ప‌త్తి చేస్తున్న కోవాగ్జిన్ మాత్రం ఈయూఎల్ జాబితాలో లేదు. దీంతో ఈ వ్యాక్సిన్ కు మ‌న దేశంలో అధికారికంగా వినియోగించేందుకు గుర్తింపు ఉన్నా... ఈయూఎల్ జాబితాలో లేని కార‌ణంగా ఇత‌ర దేశాలు దీనిని గుర్తింపు క‌లిగిన వ్యాక్సిన్ గా ప‌రిగ‌ణించే అవ‌కాశాలు లేవు. దీంతో కోవాగ్జిన్ వేసుకున్నప్ప‌టికీ.. స‌ద‌రు వ్య‌క్తుల‌ను అంత‌ర్జాతీయ ప్ర‌యాణాల‌కు ఆయా దేశాలు అనుమ‌తించ‌క‌పోవ‌చ్చ‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈయూఎల్ జాబితాలో త‌న వ్యాక్సిన్‌ ను చేర్చాలంటూ ఇప్ప‌టికే భార‌త్ బ‌యోటెక్... డ‌బ్ల్యూహెచ్ఓకు ద‌ర‌ఖాస్తు చేసుకుంద‌ట‌. అయితే ఈ ద‌ర‌ఖాస్తులో డ‌బ్ల్యూహెచ్ఓ ప‌రిశీల‌న‌కు అవ‌స‌ర‌మైన మేర వివ‌రాలు లేవ‌ట‌. దీంతో ఆ వివ‌రాల‌ను పంపాల‌ని డ‌బ్ల్యూహెచ్ఓ నుంచి భార‌త్ బ‌యోటెక్ కు ఆదేశాలు అందాయ‌ట‌. ఇదంతా జ‌రిగే స‌రికి కొంత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశాలు లేక‌పోలేదు. అప్ప‌టిదాకా కోవాగ్జిన్ వేసుకున్నా కూడా అంత‌ర్జాతీయ ప్ర‌యాణాల‌కు అనుమ‌తి ల‌భించ‌క‌పోవ‌చ్చ‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News