ఇసుక దొంగ‌ను సీఎం అభ్య‌ర్థిని చేసేశారు...ఇది కాంగ్రెస్ పరిస్థితి

Update: 2022-02-07 09:48 GMT
ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో మిగ‌తా వాటికంటే, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ & పంజాబ్ ఎన్నికలే అన్నివ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. పంజాబ్ రాష్ట్రంలో హాట్ హట్ రాజ‌కీయాలు జ‌రుగుతుండ‌టం దీనికి కార‌ణం. అయితే, తాజాగా ఈ రాష్ట్ర ఎన్నిక‌ల విష‌యంలో కాంగ్రెస్ పార్టీ ఇరుకున‌ప‌డింది. పంజాబ్‌లో తమ సీఎం అభ్యర్థి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీనే అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ వెల్లడించారు. దీనిపై ప్ర‌తిప‌క్ష ఆప్ మండిప‌డింది. ఇసుక దొంగ‌ను సీఎం అభ్యర్ధిగా కాంగ్రెస్ ఎంపిక చేసింద‌ని ఆప్ ఎద్దేవా చేసింది.

లూథియానాలో నిర్వహించిన వర్చువల్‌ ర్యాలీలో మాట్లాడుతూ రాహుల్  కాంగ్రెస్ పార్టీ పంజాబ్ సీఎం అభ్య‌ర్ధిగా చ‌ర‌ణ్‌జిత్ సింగ్ చ‌న్నీని ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న‌పై ఆప్ ఘాటుగా స్పందించింది. అక్ర‌మ ఇసుక మైనింగ్ నిందితుడిని సీఎం అభ్య‌ర్ధిగా ఎంపిక చేయ‌డం మూడు కోట్ల మంది పంజాబీల‌కు అవ‌మాన‌క‌ర‌మ‌ని ఆప్ రాష్ట్ర కో-ఇన్‌చార్జ్ రాఘ‌వ్ చ‌ద్దా అన్నారు. మూడు కోట్ల మంది పంజాబీల్లో ఇసుక దొంగ త‌ప్ప స‌రైన సీఎం అభ్య‌ర్ధి కాంగ్రెస్‌కు ల‌భించ‌లేద‌ని ఆరోపించారు. ఇసుక దొంగ‌ను సీఎం అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించిన కాంగ్రెస్‌కు అభినంద‌న‌ల‌ని ఆప్ మీమ్స్‌ను ప్ర‌చారంలోకి తెచ్చింది.

ఇదిలాఉండ‌గా, తనను సీఎం అభ్యర్థిగా ఎంచుకోవడంపై చన్నీ కాంగ్రెస్‌ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. పంజాబ్‌ను అన్ని రంగాల్లో ప్ర‌గ‌తిప‌ధంలో న‌డిపేందుకు శ‌క్తివంచ‌న లేకుండా ముందుకు సాగుతాన‌ని పేర్కొన్నారు. త‌న వ‌ద్ద డ‌బ్బు లేద‌ని, అయితే ఎన్నిక‌ల్లో ధైర్యంతో పోరాడ‌తాన‌ని, పంజాబ్ ప్ర‌జ‌లు ఈ యుద్ధంలో పోరాడ‌తార‌ని వ్యాఖ్యానించారు. ఈ ప్ర‌క‌ట‌న‌కు ముందు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లుథియానాకు చేరుకోగానే పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యుల‌తో ఓ గ‌దిలో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశానికి సీఎం చెన్నీ, పీసీసీ చీఫ్ సిద్దూ, సీనియ‌ర్ నేత సునీల్ జాఖ‌డ్‌తో స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఇక్క‌డే రాహుల్ వీరంద‌రికీ చెన్నీయే సీఎం అభ్య‌ర్థి అని చెప్పిన‌ట్లు స‌మాచారం.

అటు సిద్దూను, ఇటు సునీల్ జాఖ‌డ్‌ను రాహుల్ బుజ్జగించిన‌ట్లు తెలుస్తోంది. ఈ స‌మావేశం త‌ర్వాతే సిద్దూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీఎం అభ్య‌ర్థి ఎవ‌రైనా తాను క‌లిసే ప‌నిచేస్తాన‌ని, రాహుల్ గాంధీ మాట జ‌వ‌దాట‌న‌ని సిద్దూ స‌భలో ప్ర‌క‌టించారు. పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని సిద్దూ తెలిపారు.
Tags:    

Similar News