2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ ను `డిజిటల్ ఇండియా`గా మార్చే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు గత ఏడాది పెద్దనోట్ల రద్దును బీజేపీ సర్కార్ చేపట్టింది. బ్యాంకు ఖాతాలకు ఆధార్ - పాన్ నంబర్లను అనుసంధానం చేసేందుకు చర్యలు చేపట్టింది. అంతేకాకుండా, ప్రభుత్వ పథకాల ద్వారా లభించే నగదును నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలకే చేరేలా నగదు బదిలీ విధానాన్ని ఏర్పాటు చేసింది. వంట గ్యాస్ సబ్సిడీని కూడా ఆధార్ లింక్ చేసిన బ్యాంకు ఖాతాకు నేరుగా జమ అయ్యే పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ విధానంతో దాదాపు 3.6 కోట్ల నకిలీ గ్యాస్ కనెక్షన్లను ఏరిపారేసింది. వార్షికాదాయం రూ.10 లక్షలు దాటిన వారు స్వచ్ఛందంగా సబ్సిడీని వదిలివేసేందుకు `గివ్ ఇట్ అప్ క్యాంపెయిన్` ను చేపట్టింది. దీంతో, ఇప్పటికీ దాదాపు 75 లక్షల నకిలీ కనెక్షన్లు గుర్తించారట. ఈ విధంగా విడతల వారీగా గ్యాస్ సబ్సిడీని సాధ్యమైనంత వరకు ఎత్తివేయాలని - అర్హులైన వారికి మాత్రేమే అందేలా చూడాలని మోదీ సర్కార్ యోచిస్తోంది.
మొదటి దశను విజయవంతంగా పూర్తి చేసిన మోదీ సర్కార్ రెండో దశకు సిద్ధమైందని సమాచారం. తాజాగా, కారు కలిగి ఉన్న కుటుంబాలకు గ్యాస్ సబ్సిడీ ఎత్తి వేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ఇప్పటివరకు కారు ఉన్న కుటుంబాల వారు కూడా సబ్సిడీని అనుభవిస్తున్నారు. అంతేకాకుండా సంవత్సరాదాయం రూ.10 లక్షలు దాటినా సబ్సిడీని మాత్రం వదులుకోవడం లేదు. దీంతో, ఇకపై కారున్న వాళ్లకు సబ్సిడీ ఎత్తివేయాలని కేంద్రం డిసైడ్ అయిందట. ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రణాళికలను అధికారులు రచించారు. ఆర్టీఓ కార్యాలయాల నుంచి కారు యజమానుల వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. వారిలో సంవత్సరాదాయం రూ.10 లక్షలు దాటితే సబ్సిడీని ఎత్తేస్తారు. అంత ఆదాయం లేదని ప్రూవ్ చేసుకుంటే సబ్సిడీని పొందవచ్చు. ఈ ప్రకారం ఆదాయపు పన్ను శాఖ నుంచి ఎల్ పీజీ కస్టమర్ల ఆదాయ వివరాలను సేకరిస్తున్నారట. అయితే, వాహన రిజిస్ట్రేషన్ వివరాలను పొందడం కష్టమని అధికారులు అభిప్రాయపడుతున్నారట. స్వచ్ఛందంగా గ్యాస్ సబ్సిడీని వదులుకోవాలని మోదీ చేసిన విజ్ఞప్తికి స్పందించని వారిని(వార్షికాదాయం రూ.10 లక్షలు దాటిన వారు - సొంత కారు కలిగిన వారు ) కేంద్ర ప్రభుత్వం వెతికి పట్టుకునేందుకు చర్యలు ముమ్మరం చేసిందని చెప్పవచ్చు.