కరోనాతో అతగాడి సుడి ఎంతలా తిరిగిపోయిందంటే?

Update: 2020-03-25 07:10 GMT
అందరి జీవితాలు ఒకేలా ఉండవు. అందరిని వణికిస్తున్న కరోనా కొందరికి మాత్రం అంతులేని లక్ ను తీసుకొస్తున్నాయి. అలాంటి అరుదైన ఉదంతం ఇప్పుడు బయటకు వచ్చి సంచలనంగా మారింది. పశ్చిమబెంగాల్ కు చెందిన ఇజారుల్ కార్పెంటర్ పని చేస్తుంటాడు. తానున్న చోట పూటగడవని పరిస్థితుల్లో.. తన శ్రమకు తగ్గ ఆదాయం కోసం కేరళకు వలస వెళ్లాడు. సొంత రాష్ట్రంలో పని చేస్తే రోజుకు రూ.500 మించి సంపాదించలేని అతడు.. కేరళలో మాత్రం రోజుకు వెయ్యి వరకూ సంపాదించేవాడు.

ఇలా సాగిపోతున్న అతడి జీవితంలోకి కరోనా కలకలం రేపింది. ఈ వైరస్ భయంతో అప్పటికప్పుడు కేరళను వదిలేసి సొంత ప్రాంతానికి వెళ్లిపోయాడు. కరోనా భయంతో రోజులు గడుపుతున్నాడు. రోజువారీ ఆదాయం లేకపోవటం.. చేతిలో ఉన్న డబ్బులు అయిపోతున్న వేళ.. అతనికేం చేయాలో పాలుపోని పరిస్థితి. ఇలాంటివేళ.. ఒక లాటరీ టికెట్టు కొన్నాడు. అంతే.. తెల్లారేసరికి అతడి సుడి మారిపోయింది. అప్పటివరకూ రోజువారీ అవసరాల కోసం డబ్బులు వెతుక్కోవాల్సినోడు కాస్తా.. కోటీశ్వరుడు అయిపోయాడు. దీంతో.. అతడి ఆనందం అంతా ఇంతా కాదు.

ఇంతకాలం సంపాదన కోసం కుటుంబాన్ని వదిలేసి.. అక్కడెక్కడో దూరంగా బతకాల్సిన అవసరం తనకు లేదన్న అతగాడు.. స్థానికంగానే వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు. కరోనా వైరస్ కారణంగా తనకు మంచే జరిగిందని మురిసిపోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన కరోనా.. కొందరి బతుకుల్లో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణాన్ని నెలకొనేలా చేయటం విశేషం.
Tags:    

Similar News