మ్యాగీ నూడుల్స్ మ‌రో ట్విస్ట్‌

Update: 2015-12-11 15:03 GMT
మ్యాగీ నూడుల్స్ అంశం డైలీ సీరియ‌ల్‌ ను మించిన ట్విస్ట్‌ ల‌తో రోజుకో అప్‌ డేట్ ద్వారా తెర‌మీద‌కు వ‌చ్చింది. తాజాగా నెస్లే మ్యాగీకి మళ్లీ కష్టాలు వచ్చి పడ్డాయి. ఇన్‌స్టంట్ నూడుల్స్‌ గా ప్రజాదరణ పొందిన మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తులలో మోతాదుకు మించి సీసం, ఎంఎస్‌ జీలు ఉన్నాయని తేలడంతో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ ఎస్‌ ఎస్‌ ఏఐ) నూడుల్స్‌ ను నిషేధించింది. దీనిని నెస్లే సంస్థ బొంబాయి హైకోర్టులో సవాలు చేసింది. కోర్టు ఆదేశాల మేర‌కు ప‌లు ప్రయోగాలు నిర్వహించారు. ఇందులో మ్యాగీలో ప్రమాణాలకు అనుగుణంగానే ఉత్పత్తి కొనసాగుతోందని నిర్దారణ కావడంతో బొంబాయి హైకోర్టు మ్యాగీపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బొంబాయి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఎఫ్‌ ఎస్‌ ఎస్‌ ఏఐ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈమేరకు సుప్రీంకోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది.

ఇదిలాఉండ‌గా....వరదలతో అతలాకుతలమైన చెన్నై నగర పౌరులను ఆదుకోవ‌డంలో మ్యాగీ సంస్థ త‌న పెద్ద మ‌న‌సు చాటుకుంది. కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్ శాఖా మంత్రి హరసిమ్రిత్‌ కౌర్ కష్ట కాలంలో చెన్నై ప్రజలకు అందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన నెస్లే తమిళనాడు ప్రభుత్వానికి మ్యాగీ నూడుల్స్‌ ను అందజేసింది. వరద బాధితుల కోసం నెస్లే ఇతర ఆహార పదార్థాలతో పాటు మ్యాగీని కూడా వరద బాధితులకు అందించమని తమిళనాడు ప్రభుత్వానికి పంపింది. మంత్రి పిల‌పు మేర‌కు మొత్తం ఎనిమిది కంపెనీలు తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటుచేసిన నెహ్రూ స్టేడియంకు తమ సహాయ ప‌దార్థాలు పంపించాయి. ఈ ఎనిమిది కంపెనీల్లో నెస్లే అత్యధికంగా 10 మిలియన్ టన్నుల నూడుల్స్‌, 5000 లీటర్ల టెట్రాప్యాక్‌ పాలు, 50000 కాఫీ ప్యాకెట్లు. దీంతో పాటు 25-30 మిలియన్‌ టన్నుల నూడుల్స్‌ - 8 మిలియన్ టన్నులు మంచ్‌ - 800 కిలోల సన్‌ రైస్‌ బిస్కెట్లు సరఫరా చేసిందని ఆహారమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.నెస్లేకు నూడుల్స్‌ సురక్షితం కావని ఎఫ్‌ ఎస్‌ ఎస్‌ ఏఐ పరీక్షల్లో తేలడం తర్వాత కోర్టుకు వెళ్లడం కోర్టు నెస్లేకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో తిరిగి మార్కెట్లో ప్రత్యక్షమైంది. చెన్నై వరద బాధితులకు వీలైనంత పెద్ద మొత్తంలో ఆదుకుని ఇప్పటి వరకు నష్టపోయిన పరపతి తిరిగి పొందాలని చూస్తోందని పరీశీలకులు అభిప్రాయపడుతున్న స‌మ‌యంలోనే...తాజాగా మ‌రోమారు సుప్రీంకోర్టు రూపంలో ఆ సంస్థ‌కు శ‌రాఘాతం త‌గిలింది.

Tags:    

Similar News