బిడ్డ‌కు పాలిస్తూ మోడ‌ల్ పోజు..కోర్టులో కేసు

Update: 2018-03-03 04:18 GMT
ప్రముఖ మలయాళి నటి - రచయిత - మోడల్ గిలు జోసెఫ్.. ఓ మేగజిన్ కవర్ పేజీ కోసం ఓ బిడ్డకు పాలిస్తూ ఫొటోలకు ఫోజివ్వడం సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. ఓ మలయాళీ మ్యాగజైన్ ముఖచిత్రం పై బిడ్డకు పాలుపట్టిస్తున్న మోడల్ ఫొటోను ప్రచురించటం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. అయితే ఈ ఫొటో అసభ్యకరంగా ఉన్నదని పేర్కొంటూ న్యాయస్థానం - కేరళ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ లోనూ కేసులు వేశారు.

గృహలక్ష్మి అనే మలయాళీ మ్యాగజైన్ ముఖచిత్రంపై గిలు జోసెఫ్ అనే మోడల్ బిడ్డకు పాలిస్తున్న ఫొ టో ప్రచురించారు. ఈ నెల ఒకటో తేదీన వచ్చిన గృహలక్ష్మి సంచికపై `మేం బిడ్డలకు పాలివ్వాల్సి ఉంది. దయచేసి మమ్మల్ని పొంచిపొంచి చూడొద్దని కేరళకు చెప్పండి తల్లులారా!` అనే టైటిల్‌ తో కవర్ ఫొటో ప్రచురించారు. సోషల్ మీడియాలో పలువురు దీన్ని ప్రశంసించగా - మరికొందరు దీనికి వ్యతిరేకంగా స్పందించారు. ఫొటో అసభ్యంగా ఉందని - ఇది మహిళల అసభ్య ప్రాతినిధ్య (నిషేధ) చట్టం 1986లోని సెక్షన్ 3 - 4లను ఉల్లంఘించిందని ప్రచురణకర్తలు - మోడల్‌ పై న్యాయవాది వినోద్ మాథ్యూ కొల్లం న్యాయస్థానంలో కేసువేశారు. కేసు విచారణను కోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది. ఫేక్ ఫీడింగ్ - బాలల హక్కుల ఉల్లంఘించారని ఫిర్యాదు వచ్చిందని, దీన్ని పరిశీలిస్తున్నామని బాలల హక్కుల కమిషన్ చైర్మన్ శోభా కోషి తెలిపారు.

దుబాయ్‌ కు చెందిన మలయాళీ మోడల్ గిలు జోసెఫ్ ఓ వీడియోలో ఈ వివాదంపై స్పందిస్తూ.. బహిరంగంగా తల్లిపాలు పట్టడంపై గృహలక్ష్మి జరుపుతున్న ప్రచారంలో ఇది ఓ భాగం. ఇది వాస్తవ సమస్య. ప్రస్తుతం సమాజంలో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తమ బిడ్డకు పాలుపట్టే వాతావరణం కల్పించలేదు. బిడ్డకు పాలుఇవ్వడం అనేది తల్లి హక్కు. దీని గురించి ఎవరూ భయపడాల్సిన లేదా సిగ్గుపడాల్సిన అవసరంలేదు. ఇలాంటి ఫోజు ఇచ్చినందుకు నేను ఎంతో గర్వంగా ఫీలవ్వుతున్నా. అని చెప్పారు. బిడ్డకు పాలిస్తూ తాను ఫొటోకు ఫోజిస్తున్నా అని మా అమ్మా, చెల్లికి చెప్పాను. ఇందుకు వారు అస్సలు ఒప్పుకోలేదు. అయితే, ఈ చిత్రం ద్వారా మహిళలు - అమ్మలు - భార్యలకు నేను ఒక విషయం స్పష్టం చేయాలని అనుకుంటున్నా. మీ పిల్లలకు ధైర్యంగా పాలివ్వండి. అది ఓ అపూర్వ అవకాశం. సిగ్గుపడొద్దు అని జోసెఫ్ తెలిపింది.
Tags:    

Similar News