జేసీ అతి కేసుల వరకూ వెళ్లింది

Update: 2019-12-21 04:38 GMT
చుట్టూ పరిస్థితులు అనుకూలంగా లేని వేళ.. అన్ని మూసుకొని కూర్చోవటానికి మించిన ఉత్తమమైన పని ఉండదు. కానీ.. అందుకు భిన్నంగా నోటికి వచ్చినట్లుగా మాట్లాడి సమస్యలు కొని తెచ్చుకోవటం కొంతమంది నేతలకు అలవాటు. ఈ కోవలోకే వస్తారు టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి. వ్యక్తుల మీద ఎన్ని మాటలన్నా ఓకే కానీ వ్యవస్థల మీద అనే చిన్న మాటకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంటుంది కొన్నిసార్లు. దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉన్నా ఈ చిన్న విషయం ఇంకా బోధ పడలేదా? అన్న సందేహం మదిలే మెదిలేలా ఈ మధ్యన జేసీ చేసిన బలుపు వ్యాఖ్య ఎంతోమంది మనసుల్ని గాయపరిచేలా చేసింది.

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బూట్లు నాకే పోలీసుల్ని పెట్టుకుంటామంటూ జేసీ అతి మాటపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన మాటలకు పోలీసులు ఉడికిపోయారు. తమను చులకన చేసిన జేసీపై పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు మండిపడ్డారు.

తాజాగా జేసీ చేసిన వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు త్రిలోక్ ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా  పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలపై సమగ్ర విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆయన అన్న మాటపై చాలా ఫిర్యాదులు వస్తున్నట్లు అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి వెల్లడించారు.

తాజాగా అందిన ఫిర్యాదు ఆధారంగా జేసీపై ఐపీసీ సెక్షన్ 153, 506 కింద కేసు అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నోటిని అదుపులో ఉంచుకోకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడే అలవాటున్న జేసీకి తాజా ఎపిసోడ్ లో భారీ షాక్ తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News