ఢిల్లీ డిప్యూటీ సీఎం ఓఎస్డీని అరెస్టు చేసిన సీబీఐ

Update: 2020-02-07 07:13 GMT
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది మోడీ సర్కారు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఊహించలేని పరిస్థితి. తాజాగా జరుగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పోటాపోటీగా సాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని నిలుపుకోవాలని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తుంటే.. ఢిల్లీ కోట మీద కాషాయ జెండా ఎగరాల్సిందేనని బీజేపీ పట్టుదలతో ఉంది.

ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ రేపు (శనివారం) జరగనుంది. ఇలాంటివేళ.. అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆఫీసులో ఓఎస్డీ(ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా వ్యవహరిస్తున్న గోపాల కృష్ణ మాధవ్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఒక పన్ను ఎగవేత అంశంలో రూ.2లక్షల లంచాన్నితీసుకున్నట్లుగా ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

సరిగ్గా పోలింగ్ కు ముందు రోజు డిప్యూటీ సీఎం ఓఎస్డీ ని సీబీఐ అరెస్టు చేయటం సంచలనంగా మారింది. ఒక రోజు ముందు మనీశ్ సిసోడియా పైన క్రిమినల్ కేసు నమోదు కాగా.. రోజు గడవక ముందే ఆయన ఓఎస్డీ ఏకంగా అరెస్టు కావటం హాట్ టాపిక్ గా మారింది. కీలకమైన పోలింగ్ కు ముందు రోజును అరెస్ట్ కావటంతో ఆమ్ పార్టీ ఒత్తిడికి గురి అవుతుందని భావిస్తున్నారు. ఇక.. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 11న విడుదల కానున్నాయి.
Tags:    

Similar News