కేజ్రీ ఆఫీసులో జైట్లీ ఫైల్ ను సీబీఐ తీసుకెళ్లిందా?

Update: 2015-12-16 09:23 GMT
ఢిల్లీ రాష్ట్ర సర్కారుకు.. కేంద్రంలోని మోడీ సర్కారుకు మధ్య యుద్ధం మరింత ముదిరేలా ఉంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇందుకు బలం చేకూరేలా ఉన్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ముఖ్య కార్యదర్శి రాజేంద్ర కార్యాలయంలో సీబీఐ అధికారులు మెరుపుదాడి చేసి.. సోదాలు నిర్వహించి కొన్ని ఫైళ్లు తమ వెంట తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ముఖ్యకార్యదర్శి అవినీతికి సంబంధించినవిగా చెబుతున్న ఫైళ్ల అని సీబీఐ చెబుతున్నా.. అసలు విషయం వేరే ఉందంటోంది కేజ్రీవాల్ సర్కారు.

పేరుకు ముఖ్య కార్యదర్శి అవినీతి అని చెప్పినా అసలు కారణం వేరే ఉందంటూ కేజ్రీ సర్కారు చెబుతోంది. తాజాగా ట్విట్టర్ లో స్పందించిన కేజ్రీవాల్.. మంగళవారం తన కార్యాలయంలో సోదాలు జరిపిన సందర్భంగా సీజ్ చేసిన ఫైళ్లలో జైట్లీకి సంబంధించిన ఢిల్లీ క్రికెట్ సంఘానికి చెందిన ఫైలు ఉందన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.

ఢిల్లీ క్రికెట్ సంఘానికి అధ్యక్షునిగా వ్యవహరించిన అరుణ్ జైట్లీకి సంబంధించి.. ఆయన్ను ముప్పతిప్పలు పెట్టే ఫైలు ఒకటి ఉందని.. దాన్ని తీసుకెళ్లేందుకు సీబీఐ ప్రయత్నించిందని కేజ్రీవాల్ వర్గం ఆరోపిస్తోంది. అయితే.. కేజ్రీవాల్ మాత్రం తన ట్వీట్ లో.. ఢిల్లీ క్రికెట్ సంఘానికి అరుణ్ జైట్లీ అధ్యక్షునిగా ఉన్న సమయానికి సంబంధించిన ఫైలును సీబీఐ అధికారులు చదివారని.. అప్పడే మీడియా రావటంతో ఆ ఫైలును వదిలేసి వెళ్లినట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఆ ఫైలుకు సంబంధించిన కాపీని తమ వెంట తీసుకెళ్లి ఉండొచ్చన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. ఈ వివాదం మరింత ముదరటం ఖాయమంటున్నారు.
Tags:    

Similar News