హోదా లేదు.. ప్యాకేజీనే ఇచ్చాం: కేంద్రం వెల్ల‌డి

Update: 2021-12-22 02:24 GMT
రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదాపై మ‌రోసారి కేంద్రం త‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేసింది. విభజన అనంతరం ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగానే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇచ్చామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఇటీవల నీతి ఆయోగ్‌తో జరిపిన సమావేశంలో విజ్ఞప్తి చేసిన విషయం వాస్తవమేనని ఆయన పేర్కొన్నారు.

ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ పథకాలలో 90 శాతం కేంద్రం వాటా, 10 శాతం రాష్ట్ర వాటా ఉంటుందని ఆయన తెలిపారు. ఆ మేరకు పొందే ఆర్థిక ప్రయోజనాలను ప్రత్యేక ఆర్థిక సహాయం కింద ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరిన దరిమిలా రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందని ఆయన చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా బదులుగానే ప్యాకేజీ ఇచ్చామని స్పష్టం చేశారు. గతంలో ఏపీ ప్రభుత్వం కోరినందునే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని తెలిపారు.

విభజన చట్టం హామీలు నెరవేర్చే బాధ్యత తమదేనని.. ఏపీకి సాయం అందించేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. ఏపీకి 2015-19 మధ్య ప్రత్యేక ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. ఏపీ ఎక్స్‌టర్నల్ ఎయిడెడ్‌ ప్రాజెక్టులకు రుణం సమకూర్చామని వివరించింది. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.19,846 కోట్లు, రెవెన్యూ లోటు గ్రాంటు కింద రూ. 22,112 కోట్లు ఇచ్చామని మంత్రి వివ‌రించారు. 2020-21లో ఏపీకి రూ.5,897 కోట్లు అందించినట్లు ప్రస్తావించారు. వీటితో పాటు ప్రత్యేక ప్యాకేజీ వివరాలు వెల్లడించారు.


Tags:    

Similar News