సొమ్ము ఒకరిది సోకు ఒకరిదా..? ఏపీ ప్రభుత్వం పై కేంద్రం సీరియస్!

Update: 2021-12-04 05:15 GMT
సొమ్ము ఒకరిది సోకు ఒకరిదా.. త్యాగమొకడిది భోగమొకడిదా... ఈ మాటలు ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేంద్ర సర్కార్ అంటోంది. కేంద్ర ప్రాయోజిత పథకాలైన ఐసీపీఎస్‌, ఐసీడీఎస్‌, పోషణ్‌ అభియాన్‌ పథకాలకు ఏపీప్రభుత్వం వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, జగనన్న పాలు ఇలా పేర్లు పెట్టడం పై కేంద్రం తీవ్రంగా స్పందించింది.

ఏకంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రంగం లోకి దిగి అభ్యంతరం తెలిపారు. ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం తప్పు బట్టడానికి కారణం ఎవరో కాదు.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదే కారణం. మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన పలు పథకాల పేర్లు ఏపీ ప్రభుత్వం మార్చిందని ఆయన చేసిన ఫిర్యాదు చేశారు. రఘురామ లేఖ పై  కేంద్ర మంత్రి పైవిధంగా స్పందించారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చడం పై ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం వివరణ కోరింది. అంతేనా కేంద్ర పథకాలకు జగన్‌, ఇతర పేర్లు పెట్టడమేంటని స్మృతి ఇరానీ సూటిగా ప్రశ్నించారు.

ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పేర్లు మార్చేందుకు వీల్లేదని లేఖ రాశారు. 2021-22కు సంబంధించి అంగన్‌ వాడీలకు పోషకాహారం కోసం ఏపీకి ఇవ్వాల్సిన రూ.187.36 కోట్లు ఇప్పటికే విడుదల చేశామని ఇరానీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకాలకు మార్చిన పేర్లు, వాటి కోసం తీసుకున్న చర్యలపై ఓ నివేదిక ఇవ్వాలని పంపాలని ఆదేశించినట్లు రఘురామకు ఇచ్చిన సమాధానంలో స్మృతీ ఇరానీ పేర్కొన్నారు.

వాస్తవానికి కేంద్రం ఇప్పటి కిప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని తప్పు బట్టలేదు. గతం లో టీడీపీ ప్రభుత్వ హయాం లో కూడా కేంద్ర పథకాలకు పేర్లు మార్చి తాము అమలు చేస్తున్నట్లు చెప్పుకోవడం పై కేంద్రం అభ్యంతరం చెబుతూనే వస్తోంది. జగన్ హయాం లో కూడా అదే పరిస్ధితి కొనసాగుతుందని బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు విమర్శిస్తూనే వస్తున్నారు.

కేంద్ర పథకాలను తామే అమలు చేస్తున్నట్లు ఏపీ పోజులివ్వడం ఏమిటని ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయిన ప్పటికీ కేంద్రం ఈ విమర్శలను చూసి చూడనట్లు వ్యవహరిస్తూ వస్తోంది. రాష్ట్ర బీజేపీ నేతలు ఫిర్యాదులు చేసిన ప్పటికీ కేంద్రం పట్టించుకోలేదు. దీంతో రఘురామ రంగం లోకి దిగారు. గతం లో రఘురామ లేఖ తో స్పందించింది. రఘురామ ఫిర్యాదు వల్లే ఏపీ ప్రభుత్వం సంజాయషి ఇవ్వాల్సి వస్తోంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Tags:    

Similar News