పోలవరం- 15 ఏళ్ల కింద తనిఖీ... ఇపుడు నోటీసులా?

Update: 2019-08-08 10:02 GMT
ఆంధ్రలో వ్యవసాయానికి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు మరో ఆటంకం కనిపిస్తోంది. పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఒకవైపు పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని, అందుకు అవసరమైన సాయం అందించాలని ప్రధానికి, కేంద్రమంత్రులకు సీఎం జగన్ వినతిపత్రాలు అందిస్తున్నారు. దానికి సానుకూలంగా స్పందించి ప్రోత్సాహం అందించాల్సిన కేంద్రం ఈ షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై ఏపీ ప్రజలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. అత్యంత శోచనీయమైన విషయం ఏంటంటే... 2005 నాటి ఫిర్యాదుకు సంబంధించిన నోటీసులు ఇవి.  

అప్పట్లో పొలవరం అనుబంధ ప్రాజెక్టులపై కేంద్ర పర్యావరణ శాఖకు చెందిన చెన్నై అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారని కేంద్రానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా కేంద్రం పోలవరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసులు జారీ చేసింది. మరీ విచిత్రం కాకపోతే... ఆనాటికి ఈనాటికి ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పటికే ప్రాజెక్టు చాలావరకు పూర్తయిన నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేయడం అంటే అది ఏపీకి షాక్. ఆ కమిటీ పరిశీలన జరిపిన 14 ఏళ్ల తర్వాత కేంద్రం షోకాజ్ నోటీసులు జారీ చేయడం ఏమిటో కేంద్రంలో వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉన్నదో దీన్ని బట్టి అర్థమవుతోంది.

భారత అభివృద్ధే మా ధ్యేయం, ఏపీకి పూర్తి సహకారం అందిస్తున్నట్లు ఒకవైపు బీజేపీ చెబుతూనే ఇలా నోటీసులు ఇవ్వడంపై ఏపీ ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
   

Tags:    

Similar News