బాబు దీక్ష చేస్తే... కేసీఆర్‌ కు నిధులొచ్చాయి

Update: 2018-04-21 05:05 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు శుక్ర‌వారం చేప‌ట్టిన దీక్ష గుర్తుండే ఉంటుంది. ప్రత్యేకహోదా - విభజన హామీల అమల్లో కేంద్ర తీరును నిరసిస్తూ బాబు ఈ దీక్ష‌కు దిగారు. త‌న‌దైన శైలిలో కేంద్రంపై ఆయ‌న అస‌హ‌నం వెళ్ల‌గ‌క్క‌రు. అయితే...ఇలా చంద్ర‌బాబు విభ‌జ‌న హామీల నిర‌క్ష‌ణ‌లో ఉండ‌గానే...పొరుగు రాష్ట్రమైన తెలంగాణ‌కు కేంద్రం తీపిక‌బురు అందించింది. కీల‌క హామీని నిలబెట్టుకుంది. రాష్ట్రంలో అఖిల భారత వైద్య విజ్ఞానశాస్ర్తాల సంస్థ (ఎయిమ్స్) ఏర్పాటుకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వానికి అందాయి. ఎయిమ్స్ ఏర్పాటుకు అవసరమైన రూ.3400 కోట్లు కేటాయించిన కేంద్ర ఆర్థికశాఖ.. భూసేకరణ ప్రక్రియ - మౌలిక సదుపాయాల కల్పనకోసం (సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ విభాగం - న్యాక్) సంస్థలను గుర్తించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతిసుడాన్‌ ను ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్య‌వస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణకు ఎయిమ్స్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితమే బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించింది. అయితే నిధుల కేటాయింపు - మౌలిక వసతుల కల్పన విషయాల్లో అనుమతులపై కేంద్ర ఆర్థికశాఖ జాప్యం చేసింది. దీంతో ఢిల్లీకి వెళ్లి - ప్రధాని నరేంద్రమోడీని కలిసిన సందర్భంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు.. ఎయిమ్స్‌ కు అనుమతులు ఇవ్వాలని కోరారు. దానికితోడు టీఆర్‌ ఎస్ ఎంపీలు పార్లమెంటు వేదికగా తెలంగాణకు ఎయిమ్స్‌ కోసం పోరాటం చేశారు. పార్లమెంటు వెలుపల కూడా కేంద్ర ఆర్థిక - ఆరోగ్యశాఖ మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఎయిమ్స్‌ను సాధించేందుకు వైద్య - ఆరోగ్యశాఖ మంత్రి సీ లక్ష్మారెడ్డి ఐదుసార్లు ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ - కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తదితరులను కలిసి విన్నవించారు. అన్నిరకాల ప్రయత్నాలు ఫలించి.. ఎట్టకేలకు తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. త్వ‌రలోనే ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కానుంది.

హైద‌రాబాద్ స‌మీపంలోని బీబీనగర్ లో ఎయిమ్స్ ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుగా భావించింది. ప్రస్తుతం రాజధానిలో నాలుగైదుచోట్ల స్థలాల గుర్తింపుపై దృష్టిపెట్టాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదిత భూసేకరణ ఫైల్ వైద్య - ఆరోగ్యశాఖ సిద్ధం చేసింది. దీనిని త్వరలో సీఎం కేసీఆర్‌ కు పంపుతారని సమాచారం. సీఎం ఆమోదంతో భూసేకరణ - స్థలాన్ని ఖరారు చేయనున్నారు. అయితే విభ‌జ‌న హామీల అమ‌లు కోసం చంద్ర‌బాబు ఆవేద‌న‌ - ఆందోళ‌న వ్య‌క్తం చేస్తుండ‌గానే...తెలంగాణకు ఈ హామీల్లో ముఖ్య‌మైన‌దాన్ని నెర‌వేర్చ‌డం ఆసక్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News