లెక్కలు తేల్చుకుందాం రండి

Update: 2018-02-17 06:40 GMT
నిధుల వ్యవహారంలో కేంద్ర - రాష్ర్ట ప్రభుత్వాల మధ్య రచ్చరచ్చ అవుతున్న సమయంలో కేంద్రం నుంచి రాష్ర్టానికి లెక్కలు తేల్చుకుందాం రమ్మని పిలుపు అందినట్లు తెలుస్తోంది. ఈ నెల 21  నుంచి మొత్తం లెక్కలన్నీ తేల్చే కార్యక్రమం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
    
విభజన చట్టం హామీలు - బడ్జెట్‌ కేటాయింపులు - కడప ఉక్కు ఫ్యాక్టరీ - 2014 నుంచి రాష్ట్రానికి అందిన నిధులు - ప్రాజెక్టుల సమగ్ర నివేదికలు - యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు - ఇతర వివరాలతో రావల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 8 కీలక శాఖలకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఏపీ నుంచి  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆర్థిక శాఖ కార్యదర్శి - ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు - జనవనరుల శాఖ - మానవ వనరుల - రవాణా - గనులు - సీఆర్‌ డీఏ - పరిశ్రమలు - తదితర శాఖల కార్యదర్శులు హాజరు కానున్నారు.
    
కాగా కేంద్రం నుంచి సమాచారం అందిన నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికప్పుడు హడావుడిగా అన్నీ రెడీ చేసుకుంటోంది. ఈనెల 21 - 22 తేదీలలో ఢిల్లిలో జరిగే సమావేశంలో పాల్గొనేందుకు పూర్తి వివరాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.  పక్కా సమాచారంతో కేంద్రాన్ని నిలదీయడానికి తగినట్లు అన్నీ సిద్ధం చేయాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. అయితే.. రాష్ట్రం వద్ద సరైన లెక్కలు లేవని కేంద్రం చంద్రబాబును డిఫెన్సులోకి నెడుతుందో..లేదంటే కనికరిస్తుందో చూడాలి. బీజేపీ పెద్దల తీరు చూస్తుంటే మాత్రం దిగొచ్చేలా ఏమీ కనిపించడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు.
Tags:    

Similar News