టీడీపీలో ఉండలేం: తమ్ముళ్ల ఆవేదన.. బాబు స్పందించాల్సిందే!
ఎవరైనా అధికారంలో ఉన్న పార్టీవైపు మొగ్గు చూపుతారు. అప్పటి వరకు అధికారంలో ఉండి.. ఎన్నికల అనంతరం.. ప్రాభవం కోల్పోయిన పార్టీల గురించి ఎవరూ పట్టించుకోరు.
ఎవరైనా అధికారంలో ఉన్న పార్టీవైపు మొగ్గు చూపుతారు. అప్పటి వరకు అధికారంలో ఉండి.. ఎన్నికల అనంతరం.. ప్రాభవం కోల్పోయిన పార్టీల గురించి ఎవరూ పట్టించుకోరు. పైగా ఆయా పార్టీల నుంచి సైతం బయటకు వచ్చి.. అధికార పార్టీలో చేరతారు. ఇటీవల కాలంలో వైసీపీ విషయంలో ఇదే జరుగు తోంది. చాలా మంది నాయకులు వైసీపీ నుంచి వచ్చి టీడీపీ, జనసేన సహా ఇతర పార్టీల్లో చేరారు. ఇంకా చేరుతున్నారు. మరింత మంది రెడీగా ఉన్నారు.
అలాంటిది తాజాగా అధికార పార్టీ టీడీపీలో ఉండలేమంటూ.. కొందరు క్షేత్రస్థాయి నాయకులు కార్యకర్త లు పార్టీకి గుడ్ బై చెప్పడం రాజకీయ వర్గాలను విస్మయంలో ముంచెత్తుతోంది. నిజానికి ఇలాంటి ఘటన లు అసలు చోటు చేసుకునే పరిస్థితి లేదు. కానీ, జరిగింది. ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో బలమైన టీడీపీ వర్గంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు పార్టీకి రాం రాం చెప్పారు. టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు తామెంతో కృషి చేశామని ఈ సందర్భంగా వారు చెప్పారు.
కానీ, టీడీపీ అధికారంలోకి వచ్చాక కూడా... తమకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయిందని వాపోతున్నారు. అంతేకాదు.. ప్రతిపక్ష వైసీపీ నాయకులకు దక్కుతున్న గుర్తింపు కూడా.. తమకు దక్కడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తమకు రాజకీయ భిక్ష పెట్టినప్పటికీ.. టీడీపీకి గుడ్ బై చెప్పక తప్పడం లేదని వారు చెబుతున్నారు. తమ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో 200 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు పార్టీకి దూరమైనట్టు అయింది.
నష్టమేనా?
ఒక బలమైన నాయకుడు పార్టీ నుంచి వెళ్లిపోతే.. మళ్లీ తయారు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ, క్షేత్రస్థాయిలో పార్టీ కాడి మోసి.. జెండా కట్టే కార్యకర్తలు, నాయకులు కనుక వెళ్లిపోతే.. ఖచ్చితంగా ఆ ప్రభావం పడుతుంది. అది ఇప్పటికిప్పుడు తెలియకపోయినా.. ఎన్నికల సమయానికి ప్రజల్లో వ్యతిరేకత పెంచేందుకు ఈ కార్యకర్తలు దోహద పడే అవకాశం ఉంటుంది. గతంలో వైసీపీ ఇదే పొరపాటు చేసింది. కాబట్టి.. ఇప్పుడు సీఎం చంద్రబాబు స్పందించి.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందన్న విషయంపై ఆరా తీయాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు.