నారా లోకేష్ కి భారీ ప్రమోషన్ ?

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు.

Update: 2025-01-14 01:30 GMT

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. 2024 జూన్ 12న ఈ ప్రభుత్వం అధికారం చేపట్టింది. జనవరి 12తో ఏడు నెలలు పూర్తి చేసుకుని ఎనిమిదవ నెలలోకి అడుగు పెట్టింది. ఇక చూసుకుంటే కనుక ఈ ఏడు నెలలలో ఎన్నో రాజకీయ పరిణామాలు సంభవించాయి.

మరీ ముఖ్యంగా చూస్తే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు తరువాత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ హైలెట్ గా ఉంటూ వస్తున్నారు. కూటమి సర్కార్ లో ఆయన నంబర్ టూ అన్న ఇంప్రెషన్ అయితే ఈ సరికే క్రియేట్ అయిపోయింది. దాంతోనే టీడీపీ అనుకూల మీడ ఆ పార్టీ అధినాయకత్వాన్ని అలెర్ట్ చేస్తోంది. టీడీపీకి ప్రభుత్వానికి బాబు తరువాత లోకేష్ నాయకుడు కావాలని కూడా చెబుతూ వస్తోంది.

ఆ హిత బోధనల ఫలితాలను విశాఖలో జరిగిన నరేంద్ర మోడీ సభలో అంతా చూశారు. మోడీ సభలో పవన్ తో పాటు లోకేష్ కి ప్రసంగం చేసే చాన్స్ దక్కింది. అంతే కాదు ఫ్లెక్సీల మీద చూసినా పవన్ చంద్రబాబుతో పాటుగా కొత్తగా లోకేష్ ముఖం తొలిసారి కనిపించింది.

ఇది 2025 కొత్త ఏడాది తొలి వారంలో జరిగిన అతి పెద్ద పొలిటికల్ డెవలప్మెంట్ అయితే ఇపుడు రెండవ వారం మరో కీలక డెవలప్మెంట్ దిశగా కూటమి రాజకీయాలు సాగుతున్నాయి. లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిని అర్జంట్ గా చేయమని డిమాండ్ వస్తోంది. ఈ మేరకు ఒక కాంపెయిన్ నే స్టార్ట్ చేశారు అని అంటున్నారు.

ఇదంతా కొందరు కీలక నేతల సహకారంతోనే సాగుతోంది అన్న ప్రచారం ఉంది. ఇపుడు కాకపోతే మరెప్పుడు అన్నట్లుగానే ఇది జరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో బాబు తరువాత పవన్ అని వస్తోందని లోకేష్ పెద్దగా ఫోకస్ కాలేకపోతున్నారు అని ఒక వర్గం అంటోంది. అలా జరగకుండా ఉండాలీ అంటే లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిగా చేయాల్సిందే అంటున్నారు.

అపుడు లోకేష్ కి కూడా బాబుతో పాటు సరిసమానమంగా ప్రోటోకాల్ దక్కుతుందని ఆయన బాగా ఫోకస్ అవుతారని అంటున్నారు. ఇక ఇంకో వైపు చూస్తే లోకేష్ ని ఈ టెర్మ్ లోనే సీఎం ని చేయాలన్న డిమాండ్ కూడా వస్తోంది అని అంటున్నారు. అలా కాకుండా ఉంటే ఫ్యూచర్ ఇబ్బందులు వస్తాయని ముందు జాగ్రత్తలు చెబుతున్న వారు కూడా ఎక్కువ అయ్యారు.

అదెలా అంటే గతంలో 2009లో రెండవ సారి యూపీయే కేంద్రంలో అధికారంలోకి వచ్చినపుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయకుండా సోనియాగాంధీ తప్పు చేశారని ఆనాడు ఆయన ప్రధాని చేసి ఉంటే మోడీ కంటే ముందు ప్రధాని అయిన పొలిటికల్ హిస్టరీ ఉండేదని అంతే కాకుండా ఈ రోజున మోడీతో సరిసాటి నాయకుడిగా ప్రత్యర్ధి శిబిరంలో ఉండేందుకు ఆస్కారం సైతం ఉండేదని విశ్లేషిస్తున్నారు.

ఇక తెలంగాణాలో చూసుకున్నా పదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. రెండు సార్లూ కేసీఆర్ సీఎం అయ్యారు. ఆయన కనీసం చివరి రెండేళ్ళు అయిన కేటీఆర్ కి వదిలేసి ఆయనకు సీఎం చేసి ఉంటే ఈపాటికి కేటీఅర్ ఇమేజ్ వేరే లెవెల్ లో ఉండేదని ఆయన బీఆర్ఎస్ ని మళ్లీ గెలిపించేందుకు ఎంతో బలం వచ్చేదని చెబుతున్నారు

ఇలా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే విషయంలో అటు సోనియా గాంధీ ఇటు కేసీఆర్ విఫలం అయ్యారని ఆ పరిస్థితి అయితే చంద్రబాబు తెచ్చుకోకుండా ఉండాలి అంటే ఈ టెర్మ్ లో సీఎం గా లోకేష్ ని ప్రమాణం చేయించాల్సిందే అని అంటున్న వారూ ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో టీడీపీకి 135 మంది ఎమ్మెల్యేల భారీ సంఖ్య ఉంది.

ఎవరు కాదన్నా కూడా ఈ క్షణం అనుకుంటే లోకేష్ సీఎం అనే అంటున్నారు. అయితే బీజేపీ జనసేన దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు అన్నదే చర్చ. నిజానికి వారి అభిప్రాయం కూడా పక్కన పెట్టవచ్చు కానీ 2029లోనూ కూటమిలో వారిని కలుపుకుని ముందుకు పోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఆగుతున్నారు అని అంటున్నారు.

అయితే సీఎం గా లోకేష్ అన్న చర్చ అయినా జరగాలీ అంటే ముందు అర్జంట్ గా డిప్యూటీ సీఎంని చేస్తే ఒక కరెక్ట్ పొలిటికల్ రూట్ యువ నేతకు పడుతుందని ఆ మీదట కాగల కార్యాన్ని గంధర్వులే నెరవేరుస్తారు అంటున్నారు. ఇక్కడ మరో కొసమెరుపు ఏంటి అంటే లోకేష్ ని డిప్యూటీ సీఎం చేసి హోం శాఖ అప్పగించాలని డిమాండ్ రావడం. అదే కనుక జరిగితే ఎటువంటి డౌట్లూ లేకుండా చంద్రబాబు తరువాత ప్రభుత్వంలో లోకేష్ నంబర్ టూ అన్న బలమైన సందేశం ఇచ్చినట్లు అవుతుందని కూడా అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఇది ఎపుడు జరుగుతుంది అన్నది.

Tags:    

Similar News