యువీనే కాదు.. అంబటి రాయుడినీ తప్పించింది కోహ్లినేనా..

టీమ్ ఇండియా డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ 2011 వన్డే ప్రపంచ కప్ ను అందించిన తర్వాత క్యాన్సర్ బారినపడి జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే.

Update: 2025-01-13 19:30 GMT

టీమ్ ఇండియా డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ 2011 వన్డే ప్రపంచ కప్ ను అందించిన తర్వాత క్యాన్సర్ బారినపడి జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే, 2017 నాటికి అతడు కోలుకుని తిరిగొచ్చాడు. కానీ, అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి తన స్థాయిలో ఫిట్ నెస్ లేకపోవడంతో యువీని టీమ్ ఇండియా నుంచి తప్పించాడని మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఉతప్ప మరో ఆరోపణ కూడా చేశాడు. అది తెలుగు క్రికెటర్ కు సంబంధించినది కావడం గమనార్హం.

అంబటి తిరుపతి రాయుడు.. తెలుగు రాష్ట్రాల్లో బాగా తెలిసిన క్రికెటర్. అండర్ 16 స్థాయిలోనే సంచలనాలు నమోదు చేసినవాడు. టీమ్ ఇండియాలో తదుపరి సచిన్ అనే పేరు తెచ్చుకున్నాడు. కానీ, అతడి కెరీర్ లో ఒడిదొడుకులు ఎదురయ్యాయి. పరుగుల కంటే వివాదాలు ఎక్కువయ్యాయి. చివరకు 2013లో భారత జట్టులోకి వచ్చాడు. కొన్ని మ్యాచ్ ల్లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా టి20ల్లో కంటే వన్డేల్లో నిలకడ చూపాడు. 2017-18 సీజన్ లో రాయుడు నాలుగో నంబరులో రాణించాడు. దీంతో అతడిని 2019 ప్రపంచ కప్ నకు ఎంపికచేయడం ఖాయం అనుకున్నారు. కానీ, అనూహ్యంగా రాయుడు ఫిట్ నెస్ టెస్టు (యోయో)లో ఫెయిల్ కావడం, కొన్ని మ్యాచ్ లలో ఫెయిలవడంతో ప్రపంచ కప్ బెర్త్ మిస్ అయింది.

ఎంఎస్కే మీద నిందలు

2019లో చీఫ్ సెలక్టర్ గా ఎమ్మెస్కే ప్రసాద్ ఉన్నారు. రాయుడిని పక్కనపెట్టి విజయ్ శంకర్ అనే తమిళనాడు ఆల్ రౌండర్ ను జట్టులోకి తీసుకున్నారు. అతడిని త్రీడీ (బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) ప్లేయర్ గా చెప్పారు. కానీ, విజయ్ శంకర్ కు అంత సీన్ లేదని తేలింది. రాయుడు లేకపోవడంతో నాలుగో నంబరులో టీమ్ ఇండియా బలహీనపడింది. ఇక తనను ఎంపిక చేయకపోవడాన్ని రాయుడు తీవ్రంగా తప్పుబట్టాడు. ప్రపంచ కప్ కోసం త్రీడీ కళ్లద్దాలు కొన్నానంటూ ఎమ్మెస్కేను ఎద్దేవా చేశాడు.

కారణం కోహ్లినా..?

రాయుడు 2019 వరల్డ్‌ కప్‌ నకు సెలెక్ట్ కాకపోవడానికి కారణం ఎవరో ఇప్పుడు బయటపెట్టాడు రాబిన్ ఉతప్ప. అప్పటి వన్డే కెప్టెన్ కోహ్లికి రాయుడంటే ఇష్టం లేదని.. అందుకే అతడిని జట్టులోకి తీసుకోలేదని ఆరోపించాడు. కోహ్లికి నచ్చకుంటే పక్కన పెట్టేస్తాడని.. అతడికి సరిగ్గా అనిపించలేదంటే అవకాశాలు ఇవ్వడని ఉతప్ప నిందించాడు. ఇలానే రాయుడినీ తప్పించాడని అన్నాడు. ప్రతి ఒక్కరికీ ప్రాధామ్యాలు ఉంటాయని.. కానీ అవకాశాలే లేకుండా చేయకూడదని (రాయుడిని మనసులో పెట్టుకుని) వ్యాఖ్యానించాడు.

రాయుడికి ప్రపంచ కప్ కప్‌ జెర్సీలు, కిట్ ఇచ్చారని.. అంతా సిద్ధం అయ్యాక ఇక ఆడడమే తరువాయి అనుకుంటారని ఉతప్ప తెలిపాడు. కానీ, కోహ్లి ఆ అవకాశాన్ని ఆపేశాడని, అది తనకు నచ్చలేదని వ్యాఖ్యానించాడు.

Tags:    

Similar News