వాహనదారులకు కేంద్రం బంపర్ ఆఫర్.... వాటి కొనుగోలు పై 5 శాతం రాయితీ !

Update: 2021-03-08 05:13 GMT
దేశ వాహనరంగంలో కొన్ని మార్పులకు దారి తీస్తుందని భావిస్తున్న 'వాహన తుక్కు' పాలసీ వివరాల్ని  కేంద్రం తీసుకువచ్చింది. ఈ  ‘వాహన తుక్కు విధానం’ కింద పాత వాహనాలను స్వచ్ఛందంగా తుక్కుగా మార్చితే కొత్త వాహనాల కొనుగోలుపై 5% రాయితీ లభించనుంది. కేంద్ర రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇలాంటి ఓ పాలసీ తేబోతున్నట్లు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇప్పుడే దాన్ని మరింత క్లారిటీగా నితిన్‌ గడ్కరీ వివరించారు. పాత వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షించడానికి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య  విధానంలో దేశవ్యాప్తంగా ఆటోమేటెడ్‌ ఫిట్ ‌నెస్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

ఈ పాలసీ చాలా మంచిదని విశ్లేషకులు చెబుతున్నారు. పాతవైన వాహనాలను తిరిగి అమ్ముకోలేక, ఇంట్లో మూలన ఉంచలేక ఇబ్బంది పడేవారు. ఈ పాలసీ ద్వారా వాటిని వదిలించుకోవచ్చని అంటున్నారు. వాహనాలను తుక్కుగా మార్చడానికి అవసరమైన కేంద్రాల్ని రాష్ర్టాలు, ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేస్తాయి. ఫిట్‌నెస్‌ టెస్టులో ఫెయిలైన వాహనాలకు గ్రీన్‌ ట్యాక్స్‌ వేస్తారు. అలాగే పాత వాహనాలు అనే కారణం చెబుతూ మరికొన్ని రకాల జరిమానాలు విధిస్తారు. ఈ పెనాల్టీలు చాలా ఎక్కువగా ఉంటాయని స్వయంగా గడ్కరీయే చెప్పారు. కాబట్టి, పాత వాహనాలను ఎలాగొలా నడిపిస్తే కేంద్రం ఊరుకోదు. వాటికి ఫిట్ నెస్ లేదు అని తేల్చేస్తుంది. ఈ పాలసీ వల్ల భారతదేశ వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయనీ, 50 వేల కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని గడ్కరీ అంటున్నారు. అయితే, కేంద్రం నిర్ణయంపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. అసలే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్న తరుణంలో ఉన్న వాహనాన్ని తుక్కుగా మార్చేసుకొని కొత్త వాహనం కొనుక్కునే స్థోమత సామాన్యులకు ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు కొందరు.

వాహన తుక్కు విధానం భారతదేశ వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని గడ్కరీ అభిప్రాయపడ్డారు. కనీసం 50వేల కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని చెప్పారు. తుక్కుగా మారిన వాహనాల్లోని ఉక్కు, రబ్బరు ఇతర లోహాలను తిరిగి వినియోగించడం వల్ల ఉత్పత్తి ఖర్చు 30-40 శాతం దాకా తగ్గుతుందని చెప్పారు. కేంద్రం ప్రకటించిన విధానం ప్రకారం వ్యక్తిగత వాహనాలను 20 ఏండ్ల తర్వాత, కమర్షియల్‌ వాహనాలను 15 ఏండ్ల తర్వాత తుక్కుగా మార్చాలి. దేశంలో వాహన కాలుష్యం తగ్గాలన్నా... అంతర్జాతీయ వాతావరణ ఒప్పందాల ప్రకారం నడవాలన్నా ఇలాంటి కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవన్నది కేంద్రం ఆలోచన. ప్రస్తుతం ఆటో మొబైల్ ఇండస్ట్రీ ఏడాది టర్నోవర్ 4.5 లక్షల కోట్లు ఉంది. కొన్నేళ్లలోనే ఇది 10 లక్షల కోట్లకు చేరుతుందని గడ్కరీ అంచనా వేశారు. నిజమే మరి  దేశంలోని పాతవాహనాలన్నీ తుక్కుగా మారితే, కొత్త వాహనాలు కొనుక్కోక తప్పదు కదా.
Tags:    

Similar News