సర్కారు నిర్ణయం.. రైతుకు సరికొత్త అండ

Update: 2015-04-09 09:02 GMT
రైతులకు మరింత భరోసా ఇచ్చేలా కేంద్రం తాజాగా మరిన్ని నిర్ణయాలు తీసుకుంది. మారిన కాలానికి తగ్గట్లుగా.. అసమతౌల్యంగా ఉన్న వాతావరణంతో పలు ఇబ్బందులు పడుతున్న రైతులకు మరింత భరోసానిచ్చేలా ప్రధానమంత్రి మోడీ ప్రకటించిన వరాలు అన్నదాతకు మరింత ఆత్మస్థైర్యాన్ని ఇస్తాయనే భావన వ్యక్తమవుతోంది.

అకాల వర్షాలు.. వడగండ్ల వానల కారణంగా దెబ్బ తినే పంటలకు ఇచ్చే పరిహారాన్ని మరింతగా పెంచటంతో పాటు.. పంట నష్టాన్ని పరిగణలోకి తీసుకునే నిబంధనల్లో కీలక మార్పు చేపట్టారు.

తాజాగా ప్రకటించిన పరిహారం చూస్తే.. ఇప్పటివరకూ పది వేల రూపాయిల నష్టపరిహారం పొందేవారు ఇకపై రూ.15వేలు నష్టపరిహారంగా పొందుతారు. దీనికి మించి మరో కీలక నిర్ణయం మోడీ సర్కారు తీసుకుంది. దీని ప్రకారం.. పంటలో ఇప్పటివరకూ 50 శాతం నష్టపోతేనే పరిహారం ఇచ్చే వారు. కానీ.. పంట మొత్తంలో 33శాతం నష్టపోయినా కూడా నష్టపరిహారం పొందేందుకు అర్హులుగా ర్పకటించారు. దీంతో.. అన్నదాతలకు ప్రభుత్వం మరింత అసరాగా నిలిచే వీలుంది.

వీటికి తోడు బ్యాంకులు ఇచ్చిన రుణాలన రీషెడ్యూల్‌ చేసే విషయంలోనూ.. పంట బీమా విషయంలోనూ కొన్ని మార్పులు చేస్తున్నారు. మొత్తంగా రైతులను ఉద్దేశించి.. వారి ప్రయోజనాల్ని కాపాడేలా మోడీ సర్కారు తాజాగా తీసుకున్న నిర్ణయం దేశంలోని రైతాంగానికి సాయం చేసే అవకాశమే ఎక్కువ.

Tags:    

Similar News