ఏపీని లైట్ తీసుకుంటున్న కేంద్ర సంస్థ‌లు

Update: 2017-12-27 04:58 GMT
విభ‌జ‌న పుణ్య‌మా అని ఏపీకి జ‌రిగిన న‌ష్టం అంతా ఇంతా కాదు. న‌ష్టం సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఒక రాష్ట్రంగా కూడా గుర్తింపు ఇవ్వ‌టం లేదా? అన్న సందేహం వ్య‌క్త‌మ‌య్యేలా ప‌రిస్థితులు ఉంటున్నాయి. ఒక రాష్ట్రం అన్న త‌ర్వాత కేంద్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున కొన్ని సంస్థ‌ల్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీలో ఏర్పాటు చేయాల్సిన కేంద్ర‌సంస్థ‌ల విష‌యంలో దారుణ నిర్ల‌క్ష్యం చోటు చేసుకుంటుంద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. విభ‌జ‌న జ‌రిగి మూడున్న‌రేళ్లు అవుతున్నా.. ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తికి ఎంపిక చేసినా.. ఇవ్వాల్సిన గుర్తింపు విష‌యంలో నిర్ల‌క్ష్యం.. ప‌ట్టించుకోని తీరు క‌నిపిస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

స‌ర్వే ఆఫ్ ఇండియా విష‌యానికే వ‌స్తే.. ఈ సంస్థ భార‌త దేశ ప‌టాన్ని రూపొందిస్తుంది. అందులో అన్ని రాష్ట్రాలు.. వాటి రాజ‌ధానుల పేర్ల‌ను సూచిస్తారు. అదేం ఖ‌ర్మో కానీ.. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌స్తావించిందే లేదు. అన్ని రాష్ట్రాల రాజ‌ధానుల పేర్ల‌ను ప్ర‌స్తావించిన‌ప్ప‌టికీ.. ఏపీ విష‌యానికి వ‌చ్చేస‌రికి మాత్రం అమ‌రావ‌తి పేరును చూపించ‌లేదు.

ఇదొక్క‌టే కాదు.. ఏపీని రాష్ట్రంగా పేర్కొంటూ.. అక్క‌డ ఏర్పాటు చేయాల్సిన సంస్థ‌ల విష‌యంలోనూ కేంద్రం అంతులేని నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

సామాన్య కార్మికుల‌కు అవ‌స‌ర‌మైన ఈపీఎఫ్ నుంచి దాదాపు కీల‌క‌మైన 20 కార్యాల‌యాలు ఏపీలో ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ.. ఇప్ప‌టివ‌ర‌కూ అలాంటిదేమీ చోటు చేసుకోలేదు.  అంతేకాదు.. భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంకు ప్రాంతీయ కార్యాల‌యం.. అకౌంటెంట్ జ‌న‌ర‌ల్ కార్యాల‌యం కోసం అమ‌రావ‌తిలో స్థ‌లం కేటాయించినా.. ఇప్ప‌టివ‌ర‌కూ నిర్మాణం పూర్తి కాలేదు.

రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌.. కాగ్‌.. ఎన్ ఐసీ.. ఏఎన్ ఐ.. బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్.. జ‌నాభా లెక్క‌ల కేంద్రం.. సీబీఐ.. సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్‌.. బీఎస్ ఎన్ ఎల్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్రం ప‌రిధిలోని ప‌లు కేంద్రాల్ని ఏపీలో ఇప్ప‌టికి ఏర్పాటు చేసింది లేదు. ఇవ‌న్నీ ఏపీకి వ‌చ్చి.. అక్క‌డ కార్యక‌లాపాలు ప్రారంభిస్తే త‌ప్పించి.. రాష్ట్రంగా ప‌రిపూర్ణ‌త వ‌చ్చింది కాదు. పాల‌న‌లో వేగం పెర‌గ‌టానికి మాత్ర‌మే కాదు.. ఒక రాష్ట్రంగా క‌నిపించ‌టానికి ఇవ‌న్నీ చాలా ముఖ్యం. మ‌రి.. మూడున్న‌రేళ్లుగా మోడీ స‌ర్కారు ఇలాంటి వాటిని ఎందుకు ప‌ట్టించుకోన‌ట్లు? ఏపీ అంటే అంత చిన్న‌చూపా.. ఏం చేసినా.. ఎలా వ్య‌వ‌హ‌రించినా ఆంధ్రోళ్లు పెద్ద‌గా ప‌ట్టించుకోర‌న్న న‌మ్మ‌కమా?
Tags:    

Similar News