తెలంగాణ... దేశంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. అదేంటీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటై ఇప్పటికే నాలుగేళ్లు కావస్తోంది కదా అంటారా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటై నాలుగేళ్లు అయిన మాట వాస్తవమే గానీ... కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు మాత్రం ఆ రాష్ట్రాన్ని అసలు ఓ రాష్ట్రంగా చూస్తున్న ఛాయలే కనిపించడం లేదు. నిజంగానే అంటే... నిజమే మరి. తెలంగాణను ఓ రాష్ట్రంగా మోదీ సర్కారు పరిగణిస్తే... ఏటా అట్టహాసంగా జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆ రాష్ట్రానికి చెందిన శకటానికి ఎందుకు అవకాశం కల్పించడం లేదు? నిజమేనండోయ్... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత ఇప్పటిదాకా ఆ రాష్ట్రానికి చెందిన శకటాకిని రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో ప్రవేశమే దక్కలేదు. ఏటా రిపబ్లిక్ దినోత్సవం దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణ సర్కారు ప్రత్యేక శకటాన్ని తీర్చిదిద్దడం, ఆ శకటానికి కేంద్రం చివరి నిమిషం దాకా అనుమతి మంజూరు చేయకపోవడం, చివర్లో ఈ సారి అవకాశం ఇవ్వలేం అని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి చావు కబురు చల్లగా వినిపిస్తుండటం మనం చూస్తున్నదే. అయితే ఈ తరహా ఛీత్కాకారాలు ఎదురవుతున్నా కూడా ఏటా రిపబ్లిక్ దినోత్సవాల్లో ప్రదర్శించేందుకంటూ తెలంగాణ సర్కారు శకటాన్ని రూపొందించే పనిని మాత్రం పక్కన పెట్టలేదనే చెప్పాలి.
ఈ క్రమంలోనే ఈ నెల 26న ఢిల్లీలో అట్టహాసంగా నిర్వహించనున్న రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రదర్శించేందుకు తెలంగాణ సర్కారు ప్రత్యేకంగా శకటాన్ని రూపొందించింది. ప్రపంచంలోని అత్యంత ఘనంగా జరిగే గిరిజన ఉత్సవాల్లో ఒకటిగా ఉన్న మేడారం జాతరకు సంబంధించిన శకటాన్ని ఈ ఏటి రిపబ్లిక్ డే పరేడ్ కు ఎంపిక చేసుకుంది. సమ్మక్క సారలమ్మ జాతరగా కూడా పిలుచుకునే మేడారం జాతర తెలంగాణలో ప్రతి రెండేళ్లకోమారు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది ఆ జాతర జరగనున్న దృష్ట్యా... రిపబ్లిక్ డే పరేడ్ లో మేడారం జాతరకు సంబంధించిన శకటాన్ని ప్రదర్శించాలని తెలంగాణ సర్కారు భావించింది. ఇదే అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే తెలిపింది కూడా. అయితే ఇప్పటిదాకా కేంద్రం నుంచి ఆ శకట ప్రదర్శనకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ రాలేదట. అసలు దీనిపై ప్రస్తుత పరిస్థితి ఏమిటన్న విషయానికి వస్తే... రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించిన శకటాల ప్రదర్శన కమిటీకి కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా భేటీ అయిన ఈ కమిటీ చాలా రాష్ట్రాలకు వాటి వాటి శకటాల ప్రదర్శనపై సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటుగా పలు రాష్ట్రాల శకటాలకు అనుమతి కూడా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదే క్రమంలో తెలంగాణ సర్కారు కూడా మేడారం జాతరకు చెందిన శకటాన్ని ప్రతిపాదిస్తూ ఆ కమిటీకి ఓ వినతిని పంపింది. దీనిని పరిశీలించిన కమిటీ... మేడారం జాతర శకటానికి ఓకే చెప్పేస్తూనే దానికి కొన్ని సవరణలు చేయాలని ఆదేశాలు జారీ చేసిందట. మేడారం జాతర శకటానికి కమిటీ ఓకే చెప్పేయడమంటే... గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు కాదు. అనుమతి లభిస్తే.. సదరు శకటం ప్రదర్శనకు ఓకే అని చెప్పడం మాత్రమేనట. కమిటీ చెప్పినట్లుగా సదరు శకటానికి తెలంగాణ సర్కారు మార్పులు చేర్పులు చేసేసింది. మరోవైపు రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు సమయం సమీపిస్తోంది. అయితే ఇప్పటిదాకా కేంద్రం నుంచి గానీ, కమిటీ నుంచి గానీ ఇప్పటిదాకా తెలంగాణ సర్కారుకు అనుమలే లభించలేదట. దీంతో ఈ ఏడాది కూడా తెలంగాణ శకటానికి అనుమతి లభించదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే వరుసగా మూడేళ్ల పాటు తెలంగాణకు రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో తన శకటాన్ని ప్రదర్శించేందుకు అనుమతి లభించనట్టవుతుంది.