పోలవరంపై గేరు మార్చిన కేంద్రం!

Update: 2017-10-31 04:19 GMT
చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రతిపాదనలు - కొత్తగా తమ మీద మోపదలచుకుంటున్న భారం.. తదితర వ్యవహారాలతో కేంద్రం విసిగిపోయిందా? పోలవరం పనుల తీరును ప్రతివారం స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నానంటూ నారా చంద్రబాబునాయుడు చెబుతున్న మాటలు.. జాతీయ ప్రాజెక్టుగా తమ ఆధీనంలో జరగాల్సిన ప్రాజెక్టు పనుల విషయంలో ఆయన జోక్యం గురించి గుర్రుగా ఉన్నదా? నెమ్మదిగా చంద్రబాబు నాయుడు పర్యవేక్షణను తప్పించి, మొత్తం ప్రాజెక్టు పనులను తమ ఆధీనంలోకి తెచ్చుకుని తమ పర్యవేక్షణలోనే చేపట్టడానికి కేంద్రం నిర్ణయించుకుంటున్నదా? ఈ విషయంలో వారు కాస్త గేరు మార్చి స్పీడు అవుతున్నారా? అనే అభిప్రాయాలు ఇప్పుడు పలువురిలో కలుగుతున్నాయి.

నిజానికి పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు. దీనికి సంబంధించి నిధులు ఇవ్వడం మాత్రమే కాదు, నిర్మాణం చేపట్టడం మొత్తం కూడా వారిదే బాధ్యత. కాకపోతే.. వారు పనులు సరిగా చేయరనే నెపంతో పర్యవేక్షణ తాను చేస్తానంటూ చంద్రబాబునాయుడు వారానికోసారి మీటింగులు పెడుతున్నారు. కానీ పనులు మాత్రం జరగడం లేదు. తీరా పీకల్దాకా మునిగాక, అయిన జాప్యం మొత్తం అనుమతించి.. చివరకు కాంట్రాక్టర్లను మార్చాలనే ప్రతిపాదనతో కేంద్రం మీద అదనపు భారం మోపే ప్రతిపాదనలతో రావడాన్ని వారు ఒప్పుకోలేదు.

అసలు అది జాతీయ ప్రాజెక్టు గనుక.. పోలవరం అథారిటీ ఆధ్వర్యంలోనే దాని పనులన్నీ జరగాలి. కానీ చంద్రబాబు పుణ్యమాని ఆ అథారిటీ నామమాత్రంగా మారింది. తాజాగా కేంద్రం పోలవరం అథారిటీకి కొత్త చీఫ్ ను నియమించింది. ఏకే ప్రధాన్ ను ఈ పోస్టులో నియమించారు. ఆయన ఆధ్వర్యంలో తామే పనులు చేపట్టడానికి చూస్తున్నట్లుగా తెలుస్తోంది. తన నియామకం జరిగిన వెంటనే ఆయన నేరుగా పోలవరం డ్యాం నిర్మాణం వద్దకు వచ్చి పనులను పరిశీలించిచ తిరిగి ఢిల్లీ వెళ్లారు. ఈ పోకడలను గమనిస్తోంటే.. పోలవరం పనులకు నిధులు మాత్రమే కాదు, పనుల అమలు - అజమాయిషీ బాధ్యతలను కూడా తమ చేతిలోనే పెట్టుకోవాలని కేంద్రం అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబునాయుడు కు ఇది అసంతృప్తి కలిగించవచ్చు. కానీ, ఆయన చేయగలిగింది ఏమీ ఉండకపోవచ్చునని పలువురు భావిస్తున్నారు. నవంబరు 3వ తేదీన పోలవరం గురించి మాట్లాడడానికి చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లే సమయానికి.. ఆయన చెప్పేదానికంటె భిన్నమైన ప్రతిపాదనల్తో కేంద్రం సిద్ధంగా ఉంటుందనే వాదన వినిపిస్తోంది.
Tags:    

Similar News